Telugu Global
National

అంబులెన్స్ లు గతిలేక తోపుడు బండిపై ఆస్పత్రికి...జర్నలిస్టులపై కేసులు

అంబులెన్స్ లు దొరకక అనారోగ్యంతో ఉన్న ఓ వృద్దుడిని తోపుడు బండిపై ఆస్పత్రికి తీసుకెళ్ళిన ఘటనను ప్రసారం చేసినందుకు ముగ్గురు జర్నలిస్టులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిజాలు చూపించినందుకు ఇలా కేసులు నమోదు చేసిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

అంబులెన్స్ లు గతిలేక తోపుడు బండిపై ఆస్పత్రికి...జర్నలిస్టులపై కేసులు
X

మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లా,దబో పట్టణానికి సమీపంలోని లాహర్‌లో జ్ఞాన్ ప్రసాద్ విశ్వకర్మ అనే వృద్దుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతని కుటుంబం అతన్ని తోపుడు బండిపై ఆస్పత్రికి తీసుకెళ్ళింది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతో మరో గత్యంతరం లేక తాము ఈ పని చేయాల్సి వచ్చిందని ఆ వృద్దుడి కుంటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు. అయితే ఈ కథనాన్ని ప్రసారం చేసినందుకు మధ్యప్రదేశ్ యంత్రాంగం కుంజ్‌బిహారి కౌరవ్, అనిల్ శర్మ, ఎన్‌కె భటేలే అనే ముగ్గురు జర్నలిస్టులపై కేసులు నమోదు చేసింది.

ముగ్గురు స్థానిక జర్నలిస్టులపై మోసం, వర్గాల‌ మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, IT చట్టం కింద కేసు నమోదు చేశారు. జర్నలిస్టుల కథనం తప్పు అని పోలీసుల FIR చెప్తుండగా, పోలీసుల వాదన అబద్దమని వృద్దుడి కుటుంబం చెప్తోంది. ఆ జర్నలిస్టులు ప్రసారం చేసినదంతా నిజమేనని వాళ్ళు చెప్తున్నారు.

ఈ వ్యవహారంపై భిండ్ జిల్లా కలెక్టర్ ఎస్. సతీష్ కుమార్ రెవెన్యూ,ఆరోగ్య శాఖల అధికారులతో ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబం అంబులెన్స్ కోసం ఎటువంటి కాల్ చేయలేదని దర్యాప్తు బృందం రిపోర్టు ఇచ్చింది. అసలు ఆ వృద్దుడి కుటుంబం అతన్ని మొదట ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లలేదని రిపోర్టు పేర్కొంది.

అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతో తోపుడు బండిపై తమ తండ్రిని ఎక్కించుకొని 5 కిలోమీటర్లు తోసుకుని పోవాల్సి వచ్చిందని ఆ వ్యక్తి కుమారుడు హరికృష్ణ, కుమార్తె పుష్ప తెలిపారు.

ఆ కుటుంబం ఏ ప్రభుత్వ పథకాలు పొందడంలేదని జర్నలిస్టులు తమ రిపోర్ట్ లో నివేదించారు. అయితే అధికారులు మాత్రం జర్నలిస్టుల వాదనను ఖండిస్తూ ఆ కుటుంబం వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలను పొందుతోందని చెబుతోంది. కానీ అధికారుల వాదనని కుటుంబం తోసిపుచ్చింది అధికారులు చెప్తున్నదంతా అబద్దమని వృద్దుడి కుమార్తె పుష్ప తెలిపారు. "మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక విడత మాత్రమే లభించింది. ఆ తర్వాత ఏమీ లభించ‌ లేదు." అని ఆమె చెప్పారు.

ప్రభుత్వ అధికారులు ఇటీవల మా గుడిసె వద్దకు వచ్చి ఖాళీ కాగితంపై సంతకాలు చేయించారని కుమారుడు హరికృష్ణ ఆరోపించారు.

కుటుంబం చేస్తున్న ఈ నిర్దిష్ట ఆరోపణల‌పై ప్రభుత్వ అధికారులు స్పందించలేదు.

ఇది ఒక్క జ్ఞాన్ ప్రసాద్ విశ్వకర్మ అనే వృద్దుడి కుటుంబం సమస్యే కాదు. మధ్యప్రదేశ్ లో ప్రజలు అంబులెన్స్ దొరకక అనేక ఇబ్బందులు పడ్డ సంఘటనలు అనేకం జరిగాయని ఎన్డీటీవీ నివేదించింది.

ఇలాంటి సంఘటన‌లు జరిగిన ప్రతీ సారీ అంబులెన్స్ ల సంఖ్య పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది. అ‍ంబులెన్స్ ల సంఖ్య 1,445 నుండి 2,052కి పెరిగిందని ఏప్రిల్‌లో, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. అధునాతన లైఫ్ సపోర్ట్ వాహనాల సంఖ్య కూడా 75 నుండి 167కి పెంచబడిందన్నారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌ల సంఖ్య 531 ఉండగా, 835కి పెంచబడింది.

డయల్ 108 అంబులెన్స్ సేవల కోసం ప్రభుత్వం సంవత్సరానికి 220 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ అంబులెన్స్ లు దొరకక దాదాపు సంవత్సరానికి 10 లక్షల మంది ప్రజలు ప్రైవేట్ అంబులెన్స్‌లను ఉపయోగించాల్సి వస్తోంది అని ఎన్డీటీవీ నివేదించింది.

First Published:  21 Aug 2022 4:02 AM GMT
Next Story