Telugu Global
National

ఎన్నికల దీపావళి బొనాంజా..అక్కడ వారం పాటు నో ట్రాఫిక్ రూల్స్

ఎన్నికలు వస్తే రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాలు, చేసే పనులు ఎలా ఉంటాయో ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన ఈ దీపావళి మహా ఆఫర్ ను చూస్తే తెలుస్తుంది. ఈ వారం రోజుల పాటు అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా ఎలాంటి జరిమానాలుండవని ప్రభుత్వం ప్రకటించింది.

ఎన్నికల దీపావళి బొనాంజా..అక్కడ వారం పాటు నో ట్రాఫిక్ రూల్స్
X

త్వరలో గుజరాత్ లో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం బంపర్ దీపావళి బొనాంజా ప్రకటించింది. ఎక్కడ ఎప్పుడూ చూసుండని, వినుండని ఆఫర్ ఇది.

ఈ నెల 21 నుండి 27వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలో ఎవ్వరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా పోలీసులు జరిమానా వేయరు. ఈ విషయాన్ని స్వయంగా గుజరాత్ హోం శాఖా మంత్రి హర్ష్ సంఘవి ప్రకటించారు. సూరత్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన‌ మాట్లాడుతూ, దీపావళి పండుగ కారణంగా అక్టోబర్ 21-27 వరకు పౌరులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు వసూలు చేయరని చెప్పారు.

"ఈ రోజు, అక్టోబర్ 21, అక్టోబర్ 27 వరకు గుజరాత్ ట్రాఫిక్ పోలీసులు పౌరుల నుండి ఎలాంటి జరిమానా విధించరు. పౌరులు హెల్మెట్, లైసెన్స్, లేకపోయినా ఇతర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినా పోలీసులు వారికి జరిమానా విధించరు. మరో సారి అలా చేయకండని సలహా ఇస్తారు అంతే, "అని మంత్రి చెప్పారు.

"మీరు (ప్రజలు) ట్రాఫిక్ నిబంధనలను పాటించకూడదని దీని అర్థం కాదు, కానీ మీరు పొరపాటు చేస్తే, మీరు దానికి జరిమానా చెల్లించాల్సిన అవసరం మాత్రం లేదు" అని ఆయన తెలిపారు.

హొం మంత్రి ప్రకటనపై విపక్షాలు గుర్రుమంటున్నాయి. సోషల్ మీడియాలో నెటిజనులు బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఎన్నికల జిమ్మిక్ అని ఆరోపణలు వస్తున్నాయి.

గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, "ఎన్నికలు మీతో ఇలాంటి చాలా పనులు చేయిస్తాయి!" అని ట్వీట్ చేశారు.

బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసం వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి) చీఫ్ జయంత్ సింగ్ చౌదరి ఆరోపించారు, ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంలో జాప్యం చేసినందువల్ల బీజేపీ ప్రభుత్వం ఓటర్లను ఇలాంటి హాస్యాస్పదమైన 'రేవిడి'ల‌తో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది అని ఆయన మండిపడ్డారు.

ఎన్నికలొస్తే బీజేపీ ఏ హామీలైనా ఇస్తుందని, ఎంతకైనా తెగిస్తుందని, ప్రజల ప్రాణాలతో ఆ పార్టీకి లక్ష్యం లేదని నెటిజనులు మండిపడుతున్నారు. మరి కొందరు యువకులు మాత్రం ఈ వారం రోజులు ఇక తమ ఇష్టమొచ్చినట్టు రోడ్లపై వాహనాలు నడపవచ్చని ఫుల్ ఖుషీగా ఉన్నారు.

First Published:  22 Oct 2022 5:54 AM GMT
Next Story