Telugu Global
National

ముంచుకొస్తున్న ముప్పు.. ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు

గోధుమల విషయంలో మాత్రం దారుణమైన ఫలితాలు రాబోతున్నాయి. ఎగుమతులపై నిషేధం విధించినా కూడా దేశీయంగా దిగుబడి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయింది.

ముంచుకొస్తున్న ముప్పు.. ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు
X

దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు ఈ ఏడాది భారీగా తగ్గిపోయాయి. భారత ఆహార సంస్థ (FCI) సెంట్రల్‌ ఫూల్‌ కింద సేకరించిన గోధుమ, బియ్యం నిల్వలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు అక్టోబర్‌ గణాంకాలతో స్పష్టమవుతోంది. గత ఏడాది నిల్వలు 8.16 కోట్ల టన్నులు కాగా, ఈ ఏడాది 5.11 కోట్ల మెట్రిక్‌ టన్నులకు పడిపోయాయి. 37 శాతం నిల్వలు తగ్గిపోవడం ఇదే ప్రథమం. గోధుమల నిల్వలు ఏకంగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం.

తిండి గింజలకు కటకట..

ఆమధ్య కేంద్రం, తెలంగాణనుంచి ధాన్యం సేకరించేందుకు బెట్టు చూపించింది. రాజకీయ కక్షతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ధాన్యం సేకరణ ఆపేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, ఇతర రాష్ట్రాలకు మరో న్యాయం అన్నట్టుగా ప్రవర్తించింది కేంద్రం. దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తోంది. మరోవైపు గోధుమల ఎగుమతుల అస్తవ్యస్థ విధానాలు కూడా ఇప్పుడీ దుస్థితి కారణం అని నిపుణులు అంటున్నారు. కానీ ఇప్పుడు చేయడానికేం లేదు. చేతులు కాలాయి, ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు.

కేంద్రం కవరింగ్..

నిల్వల తగ్గుదలకు ప్రత్యక్ష, పరోక్ష కారణం కూడా కేంద్రమే. కానీ దీన్ని కూడా తమ గొప్పదనంగా చెప్పుకోడానికి కేంద్రం వెనకాడకపోవడమే సిగ్గుచేటు. గరీబ్ కల్యాణ్ యోజన కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తుండటంతో నిల్వలు నిండుకున్నాయని చెబుతున్నారు. అదే నిజమైతే.. కరోనా సమయం నుంచీ ఉచిత బియ్యం పంపిణీ జరుగుతోంది. అప్పుడు కనీసం వ్యవసాయ పనులు కూడా చురుగ్గా సాగలేదు.. అలాంటి టైమ్ లో నిల్వలు తగ్గిపోవాలి. కానీ గతేడాదికి, ఇప్పటికి 37శాతం నిల్వలు తగ్గడం, ఐదేళ్ల కనిష్టానికి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం.

బియ్యం విషయంలో ప్రమాదం ఉంది కానీ, ఇప్పటికే ఖరీఫ్‌ పంటల కోతలు ప్రారంభం కావడంతో కొంతలో కొంత పరిస్థితి మెరుగ్గా ఉంది. గోధుమల విషయంలో మాత్రం దారుణమైన ఫలితాలు రాబోతున్నాయి. ఎగుమతులపై నిషేధం విధించినా కూడా దేశీయంగా దిగుబడి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయింది. అనధికారిక నిల్వలు పెరిగిపోయాయి. గతేడాది గోధుమల నిల్వలు 4.68 కోట్ల టన్నులు కాగా, ఇప్పుడవి కేవలం 2.27 కోట్ల టన్నులు మాత్రమే. దేశంలో గోధుమల రేటు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో తిండిగింజలకు కూడా కరువు వచ్చేలే చేయడం ఎన్డీఏకే సాధ్యమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

First Published:  15 Oct 2022 1:43 AM GMT
Next Story