Telugu Global
National

'వరద జీహాదీ'.. మీడియా ఇంతగా దిగజారాలా?

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రతీదాన్నీ మతం కోణంలో చూడటం నేర్పించింది. ప్రేమలు, పెళ్ళిళ్ళు, చదువులు, వేసుకునే వస్త్రాలు, ఆహారం , సంస్కృతి... ప్రతీదాన్ని మతం దృష్టితో చూడటం, ప్రచారం చేయడం, రెచ్చగొట్టడం, హింసా ద్వేషాలు సృష్టించడం ఓ పనిగా జరిగిపోతోంది.

వరద జీహాదీ.. మీడియా ఇంతగా దిగజారాలా?
X

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రతీదాన్నీ మతం కోణంలో చూడటం నేర్పించింది. ప్రేమలు, పెళ్ళిళ్ళు, చదువులు, వేసుకునే వస్త్రాలు, ఆహారం , సంస్కృతి... ప్రతీదాన్ని మతం దృష్టితో చూడటం, ప్రచారం చేయడం, రెచ్చగొట్టడం, హింసా ద్వేషాలు సృష్టించడం ఓ పనిగా జరిగిపోతోంది. సోషల్ మీడియాలోనే కాకుండా కొన్ని ప్రధాన మీడియా ఛానళ్ళు, కొన్ని వార్తా పత్రికలు కూడా ఇదే ప్రచారాన్ని లంఖించుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు కొన్ని ఛానళ్ళు 'ఫ్లడ్ జీహాదీ' (వరద జీహాదీ) అనే కొత్త పదాన్ని సృష్టించి గుండెలు బాదుకుంటున్నాయి. ప్రకృతి సృష్టించిన విపత్తును మతానికి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.

జూన్ లో అస్సాంలో వర్దలు ప్రారంభమయ్యాయి. దక్షిణ అస్సాంలోని అతిపెద్ద పట్టణం, బరాక్ నది ఒడ్డున ఉన్న మూడు జిల్లాలకు ప్రవేశ ద్వారం అయిన సిల్చార్ నగరం నీటిలో మునిగిపోయి‍ది. ఇప్పటి వరకు అక్కడ 170కి మందికి పైగా చనిపోయారు.

జూన్ 26న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, సిల్చార్‌లో వరదలకు నలుగురు వ్యక్తులు కారణమని పేర్కొన్నారు. "బేటుకండి వద్ద కట్టను ధ్వంసం చేయకపోతే, ఇది జరిగేది కాదు," అని అతను చెప్పాడు. సిల్చార్ నుండి బేతుకండి 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది.

కట్ట ధ్వంసం చేశారని జూలై మొదటి వారంలో, నలుగురు వ్యక్తులు - కాబుల్ ఖాన్, మిథు హుస్సేన్ లస్కర్, నజీర్ హుస్సేన్ లస్కర్,రిపోన్ ఖాన్ లను అరెస్టు చేశారు.

అయితే నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని బెతుకండి గ్రామస్తులు అధికారులకు అనేక అభ్యర్థనలు చేశారని టెలిగ్రాఫ్ నివేదిక పేర్కొంది. Alt News ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించింది. ఆ ప్రాంతంలోని అనేక మంది ప్రజలు, జర్నలిస్టులతో మాట్లాడింది. చాలా కాలంగా నీళ్ళు లేకపోవడమే ఆ గ్రామస్తులను అటువంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి పురికొల్పాయని ఆల్ట్ న్యూస్ పేర్కొంది.

అయితే కథ అక్కడితో ఆగలేదు. దీనికి మతాన్ని ముడిపెట్టేందులు పలు న్యూస్ ఛానళ్ళు తహతహలాడాయి. ఆ సంఘటనకు ఏకంగా 'ఫ్లడ్ జీహాదీ' అని నామకరణం చేశాయి.

న్యూస్‌ఎక్స్ అనే ఛానల్ సిల్చార్‌లో వరదలకు సంబంధించి ప్రైమ్‌టైమ్ డిబేట్ నిర్వహించింది. ప్యానెలిస్ట్‌లలో మాజీ దౌత్యవేత్త భాస్వతి ముఖర్జీ, మాజీ హోం మంత్రిత్వ శాఖ అధికారి R.V.S. మణి, ఆరేలియస్ కార్పొరేట్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు సుమిత్ పీర్ (రాజకీయ విశ్లేషకుడిగా), మరియు iTV నెట్‌వర్క్‌లో ఎడిటోరియల్ డైరెక్టర్ (NewsX యొక్క మాతృ సంస్థ) మాధవ్ నలపట్ ఉన్నారు యాంకర్‌తో సహా ప్యానలిస్టులందరూ ఆ సంఘటనను "వరద జిహాద్" అని ప్రకటించేశారు.

అసలు యాంకర్ మీనాక్షి ఉప్రేతి మొదలుపెట్టడమే "...ఇది అమాయకమైన చిన్న చర్యలా కనిపించడం లేదు... మీరు దీన్ని సాధారణ చర్య‌ అంటారా లేక ఇందులో మీరు మరింత పెద్ద ప్లాన్ ను పసిగట్టారా... అని ప్యానలిస్టులను అడిగారు.

ముఖర్జీ ఈ సంఘటనను "అంతర్గత విధ్వంసానికి సంబంధించిన విషయం," "దేశద్రోహ చర్య" అని పేర్కొన్నారు. నలపట్ స్పందిస్తూ, ఈ సంఘటన "సామూహిక హత్యకు పథకం" అని అన్నారు. ఈ ఘటన బీజేపీ పాలిత రాష్ట్రాన్ని అస్థిరపరిచే ప్రయత్నమని ప్యానలిస్టులందరూ అభిప్రాయపడ్డారు.


బిజెపి అనుకూల ప్రచార ఔట్‌లెట్ సుదర్శన్ న్యూస్ కూడా ఇదే విధమైన అభిప్రాయాలతో న్యూస్ రూపొందించింది.

హిందీ మీడియా ఔట్‌లెట్ దైనిక్ జాగరణ్ "వరద జిహాద్" అనే పదబంధాన్ని ఉపయోగించలేదు, కానీ దాని రిపోర్ట్ లో "దీని వెనుక లోతైన కుట్ర సంకేతాలు ఉన్నాయి" అని పేర్కొంది.

వన్‌ఇండియా , విక్కీ నంజప్ప రచించిన 'ఫ్లడ్ జిహాద్: అస్సాం వరదల్లో కంటికి కనిపించని విషయాలు దాగున్నాయి.' అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ది ఫ్రస్ట్రేటెడ్ ఇండియన్ వంటి బీజేపీ అనుకూల ప్రచార కేంద్రాలు కూడా ఇదే తరహాలో నివేదించాయి.

అవే భావాలతో ఉన్న పలువురు జర్నలిస్టులు కూడా ఈ సంఘటనను "వరద జిహాద్"గా అభివర్ణించారు - లైవ్ హిందుస్థాన్ డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ హిమాన్షు ఝా; ఇండియా టుడే యాంకర్ గౌరవ్ సి సావంత్; RSS మౌత్ పీస్ ఆర్గనైజర్ సీనియర్ కరస్పాండెంట్ నిశాంత్ ఆజాద్, ఇయర్‌షాట్ వ్యవస్థాపక సంపాదకుడు అభిజిత్ మజుందార్ , పాంచజన్యలో ప్రత్యేక ప్రతినిధి అశ్వని మిశ్రా, జర్నలిస్ట్ విక్కీ నంజప్ప తదితరులు ఇవే అభిప్రాయాలను ప్రచారం చేశారు.

బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ రాహుల్ నగర్ కూడా ఇదే వాదనను వినిపించారు. అతను నలుగురు నిందితుల క్లిప్‌ను షేర్ చేస్తూ "అసోం మొత్తాన్ని ముంచడంలో విజయం సాధించారు, ఇప్పుడు మనం దానికి ఏమి పేరు పెట్టాలి. #వరద జిహాద్". అని ట్వీట్ చేశారు.

న్యూస్‌ఎక్స్, ఇతర మీడియా సంస్థలు ఆరోపించిన బేతుకండి కరకట్ట ధ్వంసం "వరద జిహాద్"గా పేర్కొన్న రెండు రోజుల తర్వాత, ముఖ్యమంత్రి శర్మ మాట్లాడుతూ, "ఇది పెద్ద విషయం కాదు. 'జిహాద్' లాంటి పదాలు వాడాల్సిన అవసరం లేదు. చిన్న మెదడు ఉన్న కొందరు వ్యక్తులు అలా చేసారు.'' అని అన్నారు.

జూలై 7న, ఒక పత్రికా ఇంటర్వ్యూలో, కాచర్ ఎస్పీ రమణదీప్ కౌర్ తన జీవితంలో మొదటిసారిగా "వరద జిహాద్" అనే పదబంధాన్ని చూశానని అన్నారు. ఈ సంఘటనలోని మత కోణాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. ఈ సంఘటనకు మతపరమైన కోణం ఇవ్వవద్దని వార్తా సంస్థలను, ఇతరులను కోరారు.

నిజానికి రుతుపవనాలకు ముందే (మార్చి నుండి మే వరకు) అసోంలో సాధారణ వర్షపాతం కంటే 41% అధికంగా నమోదైందని, జూన్ 25 వరకు సాధారణ వర్షపాతం కంటే 71% అధికంగా నమోదైందని భారత వాతావరణ శాఖను ఉటంకిస్తూ ది హిందూ నివేదించింది. ఎన్నడూ లేనంత ఈ సారి వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ చెప్పింది. దాని కారణంగానే అస్సాం మొత్తం వరదల్లోమునిగిపోయింది. ఒక్క అస్సాం మాత్రమే కాదు దేశంలోని అనేక ప్రాంతాలు వరదల కారణంగా అతలాకుతలమవుతున్నాయి. మరి దీనికి నేచర్ జీహాదీ అని పేరు పెడదామా ?

Next Story