Telugu Global
National

బీహార్ కక్షను మణిపూర్‌లో తీర్చుకున్న బీజేపీ

మణిపూర్‌లో జేడీయూకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఆరుగురులో ఐదుగురు ఇప్పుడు అధికార బీజేపీలో విలీనమయ్యారు. ఈ మేరకు మణిపూర్ అసెంబ్లీ సెక్రటేరియట్ నుంచి ప్రకటన కూడా విడుదలైంది.

బీహార్ కక్షను మణిపూర్‌లో తీర్చుకున్న బీజేపీ
X

బీహార్‌లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చి ఆర్జేడీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ ఆ తర్వాత బీజేపీపై అవకాశం దొరికినప్పుడల్లా ఫైర్ అవుతున్నారు. నితీష్ ఇచ్చిన షాక్ నుంచి బీజేపీ ఇంకా కోలుకోలేదు. అయితే ఆయనపై బీజేపీ అధిష్టానం ప్రతీకారం తీర్చుకుంది. బీహార్‌లో ఆయన‌ను టచ్ చేయడం చేతకాని బీజేపీ, మణిపూర్‌లో జేడీయూకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను త‌న‌ వైపు తిప్పుకుంది. మణిపూర్‌లో జేడీయూకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఆరుగురులో ఐదుగురు ఇప్పుడు అధికార బీజేపీలో విలీనమయ్యారు. ఈ మేరకు మణిపూర్ అసెంబ్లీ సెక్రటేరియట్ నుంచి ప్రకటన కూడా విడుదలైంది.

2020లోనూ అదే తంతు..

ఇప్పుడంటే నితీష్ కుమార్ బీజేపీకి తస్మదీయుడయ్యారు. గతంలో ఆయన బీజేపీకి అనుంగు మిత్రుడే. అప్పట్లోనే ఆయన వెనక గోతులు తవ్విన చరిత్ర బీజేపీది. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు తిప్పుకుంది. అప్పట్లోనే బీజేపీ వైఖరితో నితీష్ నొచ్చుకున్నారు. బీహార్‌లో తన పార్టీతో అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. అరుణాచల్ ప్రదేశ్‌లో తన ఎమ్మెల్యేలను లాక్కోవడం ఏంటని మధనపడ్డారు. కానీ బయట పడలేదు. బీహార్‌లో తన సీటు కిందకు నీళ్లొస్తాయని తెలిసేలోగా బీజేపీకి షాకిచ్చారు. అప్పటి వరకూ ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీతో చేతులు కలిపి బీజేపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూకి మిగిలి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేని సైతం బీజేపీ లాగేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు మణిపూర్‌పై పడింది. ఆరుగురిలో ఐదుగురిని తన వైపు తిప్పుకుంది. నితీష్‌పై ప్రతికారం అలా తీర్చుకుంది.

ఎమ్మెల్యేలకు విలువ ఉందా..?

ఇటీవల కాలంలో బీజేపీ నిస్సిగ్గుగా ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోస్తోంది. కొన్నిచోట్ల బీజేపీ విజయవంతం అయింది, కానీ మిగతా చోట్ల ముందుగానే ముఖ్యమంత్రులు అలర్ట్ అయ్యారు. మొన్న నితీష్ బీజేపీకి షాకిచ్చారు, నిన్న కేజ్రీవాల్ విశ్వాస పరీక్ష నెగ్గారు, రేపు జార్ఖండ్‌లో కూడా విశ్వాస పరీక్ష కోసం జేఎంఎం సిద్ధమవుతోంది. బీజేపీ మొదలు పెట్టిన ఈ పొలిటికల్ గేమ్ చివరకు బీజేపీ అంతానికే కారణం అవుతుందనే వాదన వినపడుతోంది.

Next Story