Telugu Global
National

మాన్యువల్‌ స్కావెంజింగ్‌ మరణాలపై కవిత రాసినందుకు పా రంజిత్ అసిస్టెంట్ పై హిందుత్వ వాదుల‌ కేసు

ఆ కవిత హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ, రైట్‌వింగ్ సంస్థ భారత్ హిందూ మున్నాని నాయకుడు సురేష్ పార్థసారథి ఫిర్యాదు ఆధారంగా అభిరామపురం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మాన్యువల్‌ స్కావెంజింగ్‌ మరణాలపై కవిత రాసినందుకు పా రంజిత్ అసిస్టెంట్ పై హిందుత్వ వాదుల‌ కేసు
X

దళిత చరిత్ర మాసాన్ని పురస్కరించుకుని దర్శకుడు పా రంజిత్ అద్వర్యంలో నడిచే నీలం కల్చరల్ సెంటర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాన్యువల్‌ స్కావెంజింగ్‌ మరణాలపై వ్యంగ్య కవిత చదివిన‌ కవి, సహాయ దర్శకుడు 'విడుతలై సిగప్పి'పై సోమవారం మే 8న కేసు నమోదైంది.

ఆ కవిత హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ, రైట్‌వింగ్ సంస్థ భారత్ హిందూ మున్నాని నాయకుడు సురేష్ పార్థసారథి ఫిర్యాదు ఆధారంగా అభిరామపురం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

'మలకుజి మరణం' (మ్యాన్‌హోల్ మరణాలు) పేరుతో భారతదేశం అంతటా మాన్యువల్ స్కావెంజింగ్ మరణాలపై రాసిన వ్యంగ్య రచన ఇది. ఇందులో హిందూ దేవుళ్ల పేర్లు పాత్రలుగా ఉన్నాయి. 'సీత' చూస్తుండగా రామన్, లక్ష్మణన్ , హనుమాన్ లు మ్యాన్ హోల్ లోకి దిగుతారు అని ఈ కవితలో ఉంది. దళితుల చరిత్ర మాసాన్ని పురస్కరించుకుని నీలం కల్చరల్ సెంటర్ నిర్వహించిన వనం ఆర్ట్స్ ఫెస్టివల్‌లో ఏప్రిల్ 30న పా రంజిత్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 'విడుతలై' ఈ కవితను వినిపించారు.

కవితా పఠనంతో సహా ఈవెంట్ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. ఆ కవిత హిందువులను కించపరిచేలా ఉందని, అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సురేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మే 9న విడుదల చేసిన ఒక ప్రకటనలో, నీలం కల్చరల్ సెంటర్, 'విడుతలై సిగప్పి'పై హిందూ మున్నాని చేసిన ఫిర్యాదును ఖండించింది. “దేశవ్యాప్తంగా రెగ్యులర్ గా జరుగుతున్న మాన్యువల్ స్కావెంజింగ్ మరణాల గురించి కవిత ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్య పట్ల సమాజంలోని అజ్ఞానాన్ని ఎత్తిచూపడానికి, అటువంటి మరణాల వైపు సమాజం దృష్టిని ఆకర్షించడానికి, మానవులకు బదులుగా దేవుడి పాత్రలను కవిత చిత్రించింది. కవిత ఉద్దేశ్యం ఎవరి విశ్వాసాలను కించపరచడం కాదు” అని ప్రకటన పేర్కొంది.

సృజనాత్మక స్వేచ్ఛను మతపరమైన సమస్యగా మార్చడానికి ప్రయత్నిస్తున్న గ్రూపులు గత మూడు రోజులుగా విడుతలైని బెదిరిస్తున్నారని ప్రకటన ఆరోపించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందుకు పోలీసులు, తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా నీలం కల్చరల్ సెంటర్ ఖండించింది.

నీలం కల్చరల్ సెంటర్ ప్రతినిధి మాట్లాడుతూ, “మాన్యువల్ స్కావెంజింగ్ ద్వారా ప్రభావితం కాని వారు మాన్యువల్ స్కావెంజింగ్ మరణాల బాధితుల స్థానంలో తమను తాము ఉంచుకోవాలనేది కవిత యొక్క ఉద్దేశ్యం.'' అన్నారు.

First Published:  9 May 2023 2:20 PM GMT
Next Story