Telugu Global
National

విగ్రహాన్ని తాకినందుకు ద‌ళిత కుటుంబానికి రూ.60 వేలు జరిమానా, ఇక‌ అంబేద్కర్‌ను మాత్రమే పూజిస్తామ‌న్న‌ కుటుంబం

హిందూ దేవత విగ్రహాన్ని ఓ దళిత బాలుడు తాకినందుకు ఆ దళిత కుటుంబానికి 60 వేల రూపాయల జరిమానా విధించారు అగ్ర కులస్తులు. దాంతో ఇకపై తాము హిందూ దేవుళ్ళను పూజించబోమని అంబేద్కరే తమ దేవుడని ఆ దళిత కుటుంబం ప్రకటించింది.

విగ్రహాన్ని తాకినందుకు ద‌ళిత కుటుంబానికి రూ.60 వేలు జరిమానా, ఇక‌ అంబేద్కర్‌ను మాత్రమే పూజిస్తామ‌న్న‌ కుటుంబం
X

దేశం పురోగ‌మిస్తుంద‌ని చెప్పుకుంటున్న ఈ ద‌శ‌లో కూడా క‌ర్ణాట‌క‌లో ఇంకా అస్పృశ్య‌త వంటి దురాచార ప‌రిస్థితులు కొన‌సాగ‌డం శోచ‌నీయం. గ్రామ దేవ‌త ఊరేగింపులో దేవత‌ విగ్ర‌హాన్ని తాకాడంటూ ఓ ద‌ళిత కుటుంబానికి గ్రామ పెద్ద‌లు రూ.60 వేల జ‌రిమానా విధించారు. అక్టోబ‌ర్ ఒక‌టో తేదీలోగా ఆ సొమ్ము చెల్లించ‌క‌పోతే గ్రామ బ‌హిష్కారం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఆల‌శ్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ దారుణానికి సంబందించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలోని కోలార్ జిల్లా మలూరు తాలూకాలోని ఉల్లెరహళ్లిలో శోభ‌మ్మ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. సెప్టెంబరు 8న గ్రామస్థులు భూతాయమ్మ జాతర నిర్వహించారు. గ్రామదేవత ఆలయంలోకి ద‌ళితుల‌ను అనుమతించలేదు. గ్రామంలో దేవ‌త ఊరేగింపు జ‌రుగుతున్న‌ప్పుడు బయట ఉన్న శోభ‌మ్మ 15 ఏళ్ల కుమారుడు, గ్రామ దేవత విగ్రహానికి క‌ట్టిన స్తంభాన్ని తాకాడు. గ్రామస్థుడు వెంకటేశప్ప దానిని గమనించి దారుణానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ మ‌రికొంద‌రిని పోగేశాడు. వారంతా క‌లిసి బాలుడి కుటుంబాన్ని గ్రామ పెద్దల ఎదుట హాజరుపరిచారు. బాలుడు

విగ్ర‌హాన్ని తాక‌డంతో విగ్ర‌హం అప‌విత్ర‌మై పోయింద‌ని అందుకు శిక్ష‌గా 60 వేల రూపాయ‌లు చెల్లించాల‌ని లేక‌పోతే గ్రామంనుంచి వెలివేస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఆ గ్రామం మ‌త్తంలో 75-80 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో ఎక్కువ భాగం వ‌క్క‌ళిగ క‌మ్యూనిటీకి చెందిన‌వారే. కేవ‌లం ప‌ది ద‌ళిత కుటుంబాలు మాత్ర‌మే ఉన్నాయి. శోభ‌మ్మ త‌న కుటుంబంతో ఊరి చివ‌ర‌లో నివ‌సిస్తోంది. ఆమె కుమారుడు స‌మీప గ్రామంలో ఉన్న పాఠ‌శాల‌లో 10 వ త‌ర‌గ‌తి చ‌దువుకుంటున్నాడు. అత‌ని తండ్రి అనారోగ్యంతో ఏ ప‌ని చేయ‌లేరు. శోభ‌మ్మ ప్ర‌తిరోజు ఉద‌యం బెంగ‌ళూరుకు వెళ్ళి అక్క‌డ ఇంటి పనులు చేస్తూ నెల‌కు 13 వేలు సంపాదిస్తుంటుంది. దానితోనే ఆమె కుటుంబ జీవ‌నం సాగిస్తోంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో 60 వేలు క‌క్కుతావా లేదా అంటూ గ్రామ‌స్తులు హుకుం జారీ చేశారు. త‌న కుమారుడు విగ్ర‌హాన్ని తాకడంతో అప‌విత్ర‌మైంద‌ని దానిని శుద్ధి చేయాల్సి ఉంటుంద‌ని, ఇత‌ర మ‌ర‌మ్మ‌తుల‌కు వెర‌సి 60 వేలు ఖ‌ర్చు అవుతుంది కాట్టివ ఆ సొమ్మును తాము చెల్లించాల్సిందేన‌ని గ్రామ‌స్థులు ఆదేశించారంటూ శోభ‌మ్మ దుఖంతో వివ‌రించింది.

ఇక‌పై అంబేద్క‌ర్ కే మా పూజ‌లు..

"దేవుడు మమ్మ‌ల్ని ఇష్టపడకపోతే, మేము ఆయనను ప్రార్థించము. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కి ప్రార్ధనలు చేస్తాం'' అని శోభ‌మ్మ అన్నారు. "దేవుడికి మన స్పర్శ నచ్చకపోతే లేదా ప్రజలు మనల్ని దూరంగా ఉంచాలని కోరుకుంటే, మనం ప్రార్థనలు చేయడం ఏమిటి? ఇతర వ్యక్తుల్లాగే, నేను కూడా డబ్బు ఖర్చు చేశాను, దేవుని కోసం విరాళాలు ఇచ్చాను. ఇకపై, నేను అలాంటిదేమీ చేయను. ఇక‌పై డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు మాత్రమే ప్రార్థనలు చేస్తాను, "అని ఆమె స్ప‌ష్టం చేసింది.

ఈ సంఘ‌ట‌న గురించి తెలుసుకున్న అంబేద్కర్ సేవా సమితి స్థానిక కార్యకర్త సందేశ్ శోభ‌మ్మ‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చారు. "నేను వారి ఇంటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో సహాయం చేశాను. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఇలాంటి సాంఘిక దురాచారాలు ఇంకా ఆచరణలో ఉంటే పేదలు ఎక్కడికి పోతారు? అని ఆయ‌న ప్రశ్నించాడు.

కోలార్ డిప్యూటీ కమిషనర్ వెంకట్ రాజా మాట్లాడుతూ, తాను బుధవారం గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని కలిశానని చెప్పారు. "మేము వారికి ఇల్లు నిర్మించడానికి ప్లాట్ ఇచ్చాము ,వారికి కొంత డబ్బు చెల్లించాము. శోభ‌మ్మకు సాంఘిక సంక్షేమ హాస్టల్‌లోనూ ఉద్యోగం కల్పిస్తాం. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తాం." అని రాజా చెప్పారు. కాగా, గ్రామపంచాయతీ మాజీ సభ్యుడు నారాయణస్వామి, గ్రామ ప్రధాన్‌ భర్త వెంకటేశప్ప, పంచాయతీ వైస్‌ ప్రెసిడెంట్‌తో పాటు మరికొంత మందిపై పోలీసులు పౌర హక్కుల పరిరక్షణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు న‌మోదు చేశారు. .

కర్ణాటకలో ఇలాంటి ఘటనలు కొత్త కాదు. గత సంవత్సరం, కొప్పల్ జిల్లాలోని మియాపూర్ గ్రామంలో, స్థానిక దేవాలయంలోకి ఓ దళిత బాలుడుప్రవేశించినందుకు గ్రామ నాయకులు ఒక దళిత కుటుంబానికి రూ.25,000 జరిమానా విధించారు. ఈ సమస్యపై దృష్టి సారించిన ప్రభుత్వం అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన వినయ సమరస్య యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

First Published:  23 Sep 2022 6:38 AM GMT
Next Story