Telugu Global
National

ఆర్థిక శాఖలో గూఢచర్యం.. ఉద్యోగి అరెస్ట్

ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు కూడా విదేశాలకు ఇతడు చేరవేశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక శాఖలో గూఢచర్యం.. ఉద్యోగి అరెస్ట్
X

కేంద్ర ఆర్థిక శాఖలో గూఢచర్యం బయటపడింది. కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు చేరవేస్తున్న ఒక ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక శాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి.. ఆర్థిక శాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని విదేశాలకు చేరవేసినట్టు పోలీసులు గుర్తించారు.

గూఢచర్యం చేస్తున్న ఉద్యోగి పేరు సుమిత్. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఇతడు కొంతకాలంగా కీలకమైన విషయాలను తన మొబైల్ ద్వారా విదేశాల్లోని కొన్ని సంస్థలకు చేరవేస్తున్నాడు. అందుకు ప్రతిగా భారీగా విదేశాల నుంచి డబ్బులు అతడికి అందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. సమాచారాన్ని చేరవేసిన మొబైన్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ప‌రిశీలిస్తున్నారు.

ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు కూడా విదేశాలకు ఇతడు చేరవేశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సుమిత్‌పై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. సుమిత్ ఏ దేశాలకు సమాచారాన్ని అందజేశాడు.. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న దానిపై లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నవంబర్‌లో విదేశాంగ శాఖలోనూ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇదే తరహాలో గూఢచర్యానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళ సదరు డ్రైవర్‌ను ముగ్గులోకి దింపి.. విదేశాంగ శాఖకు చెందిన కీలక సమాచారాన్నికాజేసినట్టు గుర్తించారు. ఇప్పుడు ఆర్థిక శాఖలోనూ అలాంటి ఉదంతం బయటపడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

First Published:  19 Jan 2023 7:08 AM GMT
Next Story