Telugu Global
National

కస్టమ్స్ డ్యూటీ పేరుతో కొత్త మోసం..జాగ్రత్తలు చెబుతున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

సైబ‌ర్ నేర‌గాళ్లు ఆన్‌లైన్ వేదిక‌గా చెల‌రేగిపోతున్నారు. రోజుకో కొత్త స్కామ్‌తో అమాయ‌కుల నుంచి అడ్డంగా దోచేస్తున్నారు.

కస్టమ్స్ డ్యూటీ పేరుతో కొత్త మోసం..జాగ్రత్తలు చెబుతున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
X

సైబ‌ర్ నేర‌గాళ్లు ఆన్‌లైన్ వేదిక‌గా చెల‌రేగిపోతున్నారు. రోజుకో కొత్త స్కామ్‌తో అమాయ‌కుల నుంచి అడ్డంగా దోచేస్తున్నారు. ఆన్‌లైన్‌ మోసాలపై ప్రభుత్వాలు, పోలీసులు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.

నిన్న మొన్నటిదాకా ఫేక్ కాల్స్, ఫేక్ ఎస్సెమ్మెస్‌ స్కామ్‌లు, నకిలీ కస్టమర్‌కేర్ నంబర్లు, upi ఐడి వంటి వాటితో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో కొత్త ప్లాన్ తో వచ్చారు. విదేశాల నుంచి మీకు చాలా ఖరీదైన బహుమతి వచ్చిందని, కానీ దాని కస్టమ్‌ క్లియరెన్స్‌ కోసం కొంత నగదు తమ బ్యాంకు అకౌంట్ కి బదిలీ చేయాలని ఇండియన్‌ కస్టమ్స్‌ పేరుతో ఫోన్‌ చేస్తారు.

కాస్త అమాయకంగా ఉండి నమ్మినవాళ్ళతో తమ అకౌంట్ లో డబ్బులు వేయించుకుంటారు. అయితే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కస్టమ్స్‌ డ్యూటీ పేరుతో ప్రకటనలను ఎక్స్‌ (ట్విట్టర్) లో షేర్‌ చేసింది.


కస్టమ్స్‌ డ్యూటీ డబ్బును వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయమని ఇండియన్‌ కస్టమ్స్‌ ఎప్పుడూ కోరదని, అలాగే, కస్టమ్స్ డ్యూటీ కోసం ఫోన్‌ కాల్‌, ఎస్సెమ్మెస్‌ ద్వారా సంప్రదింపులు జరపదని తెలిపింది. ఎటువంటి సమాచారమైనా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్ కస్టమ్స్‌ (CBIC) వెబ్‌సైట్‌లో వెరిఫై చేసిన డాక్యుమెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (DIN) ద్వారానే ఇస్తుంది’ అని పేర్కొంది.

వినియోగదారుల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ ఇండియన్‌ కస్టమ్స్‌ పేరుతో ఏదైనా డాక్యుమెంట్‌ లేదా ఈ-మెయిల్‌ వస్తే అందులో డాక్యుమెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ నంబర్‌ ఉందా? లేదా? అని చెక్‌ చేయాలని సూచించింది. అలాగే వెంటనే లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలిపింది.

First Published:  9 Aug 2023 4:28 PM GMT
Next Story