Telugu Global
National

సబర్మతిలో జీఎస్టీ ఉద్యమం.. మోదీ మనసు కరిగేనా..?

చేనేత సంఘాల నేతలకు మద్దతుగా సినీ నటి పూనమ్ కౌర్ కూడా గుజరాత్ వెళ్లారు. గాంధీ విగ్రహం పక్కనే కూర్చుని తమ నిరసన తెలిపారు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

సబర్మతిలో జీఎస్టీ ఉద్యమం.. మోదీ మనసు కరిగేనా..?
X

ఏటా ఏదో ఒక సందర్భంలో రాజకీయ నేతలు గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం సందర్శించడం ఆనవాయితీ. మెడలో నూలు దారాలు వేసుకోవడం, గాంధీ నూలు వడికిన రాట్నంతో ఫొటోలకు ఫోజులివ్వడం అందరూ చేసేదే. చేనేతపై గాంధీకి ఉన్న మక్కువను గుర్తు చేసుకోవడం, నేత వస్త్రాలు ధరించాలంటూ నినాదాలివ్వడం అందరికీ పరిపాటే. ప్రధాని నరేంద్రమోదీ కూడా తక్కువేం కాదు, కాస్త ఎక్కువే. మరి మోదీ మాత్రం దేశంలో తొలిసారి చేనేత వస్త్రాలపై పన్ను వేసిన ప్రధాని అనే ఘనత సాధించారు. 5 శాతం జీఎస్టీతో నేతన్నల వెన్ను విరిచాడు. దీనికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ సహా విపక్షాలన్నీ గట్టిగానే పోరాటం చేస్తున్నాయి. తాజాగా తమ నిరసనకు సబర్మతి ఆశ్రమాన్నే వేదికగా చేసుకున్నారు అఖిల భారత పద్మశాలి సంఘం నేతలు. వారికి మద్దతుగా సినీ నటి పూనమ్ కౌర్ కూడా కదలి వెళ్లారు. గాంధీ విగ్రహం పక్కనే కూర్చుని తమ నిరసన తెలిపారు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో చేనేత ముఖ్య భూమిక పోషించిందని, చేనేత కళను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు నేతన్నలు. గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకునే ప్రధాని మోదీకి గాంధీజీ సైద్ధాంతిక విధానాన్ని గుర్తు చేయడానికే తాము గుజరాత్ వచ్చామని తెలిపారు. గ్రామ స్వరాజ్యం, గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన గాంధీజీ నివాసమైన సబర్మతి ఆశ్రమం నుంచి తమ గొంతు వినిపిస్తున్నామని అన్నారు.

చేనేతపై పన్ను.. గాంధీ సిద్ధాంతానికి వ్యతిరేకం

చేనేతపై పన్నులు వేయడమంటే అది గాంధీజీ సిద్ధాంతానికి విరుద్ధమని వారు అన్నారు. చేనేత రంగాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. చేనేత రంగ బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ చేనేత విధానాన్ని ప్రకటించి, చేనేత రంగానికి రాయతీలను ఇవ్వాలని కోరారు. చేనేతపై జీరో జీఎస్టీ, జాతీయ చేనేత విధానంపై అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  11 Nov 2022 4:16 PM GMT
Next Story