Telugu Global
National

రైతులే ఇకపై ఎన్నికల బరిలో దిగాలి : బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్

మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నాయకులు బుధవారం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని బీఆర్ఎస్‌లో చేరారు.

రైతులే ఇకపై ఎన్నికల బరిలో దిగాలి : బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్
X

దేశంలో రైతుల స్థితిగతులు మారాలి. రోడ్లపై ఆందోళనలు చేయడానికే పుట్టినట్లుగా రైతుల పరిస్థితి తయారయ్యిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా రైతును కాబట్టే.. దేశంలో తొలి సారి కిసాన్ సర్కార్ రావాలనే నినాదాన్ని వినిపిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో రైతు ప్రభుత్వం ఉండటం వల్లే.. రైతులు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. దేశంలో కూడా ఇలాంటి ఆదర్శ పాలన రావాల్సి అవసరం ఉందని కేసీఆర్ ఉద్ఘాటించారు.

మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నాయకులు బుధవారం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని బీఆర్ఎస్‌లో చేరారు. ఎన్సీపీ, బీజేపీ నుంచి వచ్చిన పలువురు నాయకులను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఇందులో రిటైర్డ్ ఐపీఎస్, మహారాష్ట్ర ఐజీ విఠల్ జాదవ్, మరాఠీ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డ్యాన్సర్, ఎన్సీపీ నేత సురేఖ పునేకర్‌ ఉన్నారు. వీరితో పాటు సామాజిక కార్యకర్తలు శేఖర్ అంబేద్కర్, ఉమాకాంత్ మంగ్రూలేతో పాటు మరి కొందకు కీలక నేతలు కూడా ఉన్నారు. వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ..

వ్యవసాయ పనులు వదులు కొని రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం ఇకపై ఉండబోదు. రైతులు స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ చెప్పారు. మన ఓటు మనకు అనే చైతన్యంతోనే.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.. అనే నినాదాన్ని నిజం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చిందని కేసీఆర్ చెప్పారు. దేశ రాజకీయాల్లో సమూల మార్పు రావాలంటే ఇకపై రైతులే ఎన్నికల బరిలోకి దిగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

రాజకీయ పార్టీల మూస ధోరణులకు భిన్నంగా ఆలోచిస్తేనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యం అవుతుంది. దేశ ప్రజలు మార్పును గట్టిగా కోరుకుంటున్నారు. దేశంలో 42 శాతంగా ఉన్న రైతులు కనుక తమ ఓట్లు తామే వేసుకుంటే.. తప్పకుండా రైతు ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ చెప్పారు. ఇతర పార్టీలకు ఓట్లు వేస్తే రైతుల కష్టాలు ఎన్నటికీ తీరవు. రైతు ప్రభుత్వమే వస్తే.. రైతులు బాగుపడతారని కేసీఆర్ చెప్పారు.

రాబోయే ప్రతీ ఎన్నికలో రైతులే స్వయంగా బరిలోకి దిగి మిగతా పార్టీలకు బుద్ది చెప్పాలి.. కిసాన్ ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పారు. దేశంలో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

First Published:  21 Jun 2023 11:30 PM GMT
Next Story