Telugu Global
National

ప్రభుత్వంపై మళ్ళీ పోరాటం షురూ...రేపటి నుంచి 21 వరకు 75 గంటల పాటు రైతుల మహాధర్నా

రైతుచట్టాలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన దేశ రైతాంగం తమ పోరాటాన్ని ఇంకా ఆపలేదు. లఖి‍ంపూర్ ఖేరీలో రైతుల హత్యకు కారణమైన కేంద్రమంత్రిని తొలగించాలని, నూతన‌ విద్యుత్ చట్టం వెనక్కి తీసుకోవాలనే తదితర డిమాండ్లతో రేపటి నుంచి 75 గంటల పాటు మహా ధర్నా నిర్వహించనున్నారు.

ప్రభుత్వంపై మళ్ళీ పోరాటం షురూ...రేపటి నుంచి 21 వరకు 75 గంటల పాటు రైతుల మహాధర్నా
X

లఖింపూర్ ఖేరీలో రైతుల హత్యకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తైనీని మంత్రివర్గం నుంచి తొలగించి అరెస్టు చేసి జైలుకు పంపాలనే డిమాండ్ తో సహా మరికొన్ని డిమాండ్లతో రైతులు 75 గంటల మహా ధర్నా నిర్వహించనున్నారు.లఖింపూర్ లో రేపు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ ధర్నా 21వ తేదీ వర‌కు సాగుతుంది. ఈ ధర్నాకు యూపీలోని అన్ని జిల్లాలతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా 20కి పైగా రాష్ట్రాల‌ నుంచి రైతులు లఖింపూర్ మండికి వస్తారని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరీ రైతుల హత్య పై రైతాంగం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రమంత్రి తేనీ కుమారుడు తన వాహనం ఎక్కించి నలుగురు రైతులను చంపేశాడు. దీంట్లో మంత్రి హస్తం కూడా ఉందని అతన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఈ డిమాండ్ తో చాలా కాలంగా పోరాటం చేస్తున్న రైతుసంఘాలు చివరకు 75 గంటల‌ మహాధర్నాకు సిద్దమయ్యారు.

ఈ మహా ధర్నాకు సంబంధించి నిన్న సంయుక్త మోర్చా నాయకులు సమావేశయ్యి మహాధర్నా డిమాండ్లను ప్రకటించారు. డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి.

* లఖింపూర్ ఖేరీ జిల్లా టికోనియాలో నలుగురు రైతులను, ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో అసలు కుట్ర దారు , దోషిగా తేలిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తైనీని మంత్రివర్గం నుంచి తొలగించి అరెస్టు చేసి జైలుకు పంపాలి.

* లఖింపూర్ ఖేరీ హత్యకేసులో నిర్దోషులయినప్పటికి జైలుకెళ్లిన రైతులను వెంటనే విడుదల చేయాలి. వారిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

* రైతాంగ ఉద్యమ సమయంలో కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. అమరులైన రైతుల కుటుంబాలకు, గాయపడిన రైతులకు నష్ట పరిహారం ఇస్తానన్న ప్రభుత్వ వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలి.

* అన్ని పంటలపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా, C-2 + 50% ఫార్ములాతో కనీస మద్దతు ధరను హామీనిచ్చే చట్టం చేయాలి. కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వ్యతిరేక కమిటీని రద్దు చేయాలి, అన్ని పంటలు కనీస మద్దతు ధరకు అమ్మాలి, పర్యవేక్షణ కోసం కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలి.

* ప్రజా వ్యతిరేక విద్యుత్ బిల్లు 2022 ఉపసంహరించుకోవాలి.

* భారతదేశంలోని అందరి రైతుల అన్ని రకాల అప్పులను రద్దు చేసి వారిని రుణ విముక్తులను చేయాలి.

* ఉత్తరప్రదేశ్‌లోని అన్ని చెరకు మిల్లులకు రైతుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

* ఏళ్ల తరబడి అడవిలో నివసించి, దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి, లఖింపూర్ తదితర జిల్లాల నుండి వచ్చి స్థిరపడిన రైతులకు, స్థానికులకు కూడా భూమి నుండి తొలగాలనే నోటీసులు ఇవ్వడాన్ని నిలిపివేయాలి.

.

సంయుక్త మోర్చా సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీకి చెందిన డాక్టర్ దర్శన్ పాల్‌, జై కిసాన్ ఆందోళన్ బికెఐయు, కిసాన్ సభ, తేరాయ్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఫ్రంట్‌, క్రాంతికారి కిసాన్ యూనియన్‌, బికెయు అఖిల భారత క్రాంతికారి కిసాన్ సభ, మజ్దూర్ కిసాన్ ఏక్తా మంచ్, జన్‌వాడీ కిసాన్ సభ, కిసాన్ వికాస్ మంచ్‌, తదితర సంఘాలకు చెందిన ప్రముఖ రైతు నాయకులు నిన్న జరిగిన‌ సమావేశంలో పాల్గొన్నారు.

First Published:  17 Aug 2022 4:05 AM GMT
Next Story