Telugu Global
National

బొమ్మైకి తలనొప్పిగా మారిన కేసీఆర్..

రైతులకోసం ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కర్నాటక ప్రభుత్వం చెల్లించడంలేదు. దీంతో అక్కడ అన్నదాతలు రోడ్డెక్కారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు, కర్నాటకలో ఎందుకు అమలు చేయలేరంటూ నిలదీస్తున్నారు.

బొమ్మైకి తలనొప్పిగా మారిన కేసీఆర్..
X

కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి కొత్త తలనొప్పి మొదలైంది. దానికి కారణం పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ కావడం విశేషం. కేసీఆర్ కావాలని బొమ్మైని టార్గెట్ చేయలేదు, కానీ అనుకోకుండా కేసీఆర్ చేసిన మంచి బొమ్మైకి ఇబ్బందిగా మారింది. అవును, తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు మాకు కూడా కావాలంటూ కర్నాటకలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చడం, అరెస్ట్ ల వరకు వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది.

రైతుబంధు సహా, అన్నదాతలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను తెలంగాణ అమలు చేస్తోంది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలన్న కేంద్రం దుర్మార్గ ఆలోచనను కేసీఆర్ గట్టిగా అడ్డుకున్నారు. ఆర్థిక సాయంలో కోత పెట్టినా రైతులకోసం ధైర్యంగా ముందడుగు వేశారు. కానీ కర్నాటకలో డబుల్ ఇంజిన్ ట్రబుల్ లో పడింది. మోటర్లకు మీటర్లు అక్కడ కచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ మినహా, రాష్ట్రం తరపున ఎలాంటి రైతు బంధు లేదు. రైతులకోసం ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కర్నాటక ప్రభుత్వం చెల్లించడంలేదు. దీంతో అక్కడ అన్నదాతలు రోడ్డెక్కారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు, కర్నాటకలో ఎందుకు అమలు చేయలేరంటూ నిలదీస్తున్నారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కర్నాటకలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. బెంగళూరుని ముట్టడించారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్న క్రమంలో జాతీయ రైతు సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నాటక రైతులకు సంఘీభావంగా దక్షిణ భారత రైతు సమాఖ్య నాయకులు కూడా కదలి వచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు, ఉత్తరాది రాష్ట్రాల రైతు నాయకులు కూడా ధర్నాలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలపై జీఎస్టీ రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ మోడల్ ని ఫాలో కావాలంటున్నారు. కర్నాటక అసమర్థతను ఎత్తి చూపడంతోపాటు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతూ రైతులు ఆందోళన చేపట్టడంతో బొమ్మై సర్కారు డైలమాలో పడింది.

First Published:  27 Sep 2022 2:45 AM GMT
Next Story