Telugu Global
National

యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆమె 1940లో కృష్ణమూర్తి దంపతులకు జన్మించారు. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో తాత గారు ఆమెకు యామినీ పూర్ణ తిలక అంటూ నామకరణం చేశారు.

యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
X

ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (84) శనివారం తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. నృత్యంలో భారత దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన యామినిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ (1968), పద్మభూషణ్‌ (2001), పద్మ విభూషణ్‌ (2016) పురస్కారాలతో సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ స్థాపించి ఎంతో మంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్‌ ఫర్‌ డ్యాన్స్‌ పేరుతో పుస్తకం రచించారు.

ఇంతటి ఖ్యాతి సాధించిన యామినీ పదహారణాల తెలుగింటి ఆడపడుచు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆమె 1940లో కృష్ణమూర్తి దంపతులకు జన్మించారు. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో తాత గారు ఆమెకు యామినీ పూర్ణ తిలక అంటూ నామకరణం చేశారు. క్షీరసాగరమథనంలో మోహినీగా, భామాకలాపంలో సత్యభామగా, ఉషా పరిణయంలో ఉషగా, శశిరేఖా పరిణయంలో శశిరేఖగా ఎన్నో నృత్యరూపకాల్లో పలు పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు.

First Published:  3 Aug 2024 3:00 PM GMT
Next Story