Telugu Global
National

బీజేపీకి భయపడ్డ ఫేస్ బుక్

భారత్ లో విద్వేష ప్రసంగాలను వ్యాప్తి చేసేందుకు ఫేస్ బుక్ పరోక్షంగా ఉపయోగపడుతోంది. దీనికి సంబంధించి ఇతర దేశాల్లోలాగే భారత్ లో కూడా మానవ హక్కుల ప్రభావ అంచనా (HRIA) అనే నివేదిక తయారు చేయడానికి సిద్ధపడింది.

బీజేపీకి భయపడ్డ ఫేస్ బుక్
X

విద్వేష పూరిత ప్రసంగాలకు సోషల్ మీడియా వేదిక అవుతోందనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ విద్వేషాన్ని వడకట్టాలంటే, మనుషుల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు చర్యల ఆటకట్టించాలంటే.. దానికి తగిన తనిఖీ వ్యవస్థ అవసరం. అలాంటి తనిఖీ వ్యవస్థను రూపొందించే విషయంలో ఫేస్ బుక్ సహజ న్యాయాన్ని మరచింది. భారత్ లో తన వ్యాపార సామ్రాజ్యానికి నష్టం లేకుండా చేసుకోడానికి బీజేపీకి వంతపాడుతోంది.

భారత్ లో విద్వేష ప్రసంగాలను వ్యాప్తి చేసేందుకు ఫేస్ బుక్ పరోక్షంగా ఉపయోగపడుతోంది. దీనికి సంబంధించి ఇతర దేశాల్లోలాగే భారత్ లో కూడా మానవ హక్కుల ప్రభావ అంచనా (HRIA) అనే నివేదిక తయారు చేయడానికి సిద్ధపడింది. కొంతమంది ప్రొఫెసర్ల ఆధ్వర్యంలోఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం 2019 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు 600 ఫేస్ బుక్ పేజ్ లను పర్యవేక్షించింది. వారి అధ్యయనంలో భారత్ లో విద్వేష ప్రసంగాలకు ఫేస్ బుక్ వేదికగా మారిందని తెలిసింది. హిందూ అతివాదులకు సంబంధించిన ఫేస్ బుక్ పేజ్ లలో విద్వేషాల విషం చిమ్ముతున్నారని బహిర్గతమైంది. ముఖ్యంగా వీరు మూడు రకాలుగా ఫేస్ బుక్ ని ఉపయోగించుకుంటున్నారు.

1. ముస్లింల‌కు వ్యతిరేకంగా హిందూ గ్రూప్ లను సమీకరించడం

2. ముస్లింలు భారతీయులు కాదు అనే దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేయడం

3. ముస్లింలపై ద్వేషం పెరిగేలా, హిందువుల్లో విద్వేషం రగిలేలా వీడియోలు పోస్ట్ చేయడం..

ప్రధానంగా ఈ మూడు ప్రయోజనాలకోసం కొంతమంది మతోన్మాదులు ఫేస్ బుక్ ని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా త్వరగా, సులభంగా సమాచారాన్ని మార్చుకుంటున్నారు. మారణహోమాలకు పథకాలు రచిస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి ఆందోళకర పరిస్థితుల్లో ఫేస్ బుక్ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలి, ఆయా అకౌంట్లను బ్లాక్ చేయాలి. కానీ భారత్ లో అలా జరగడంలేదు. అసలు HRIA నివేదికను సైతం ఫేస్ బుక్ ఇప్పటి వరకు బయటపెట్టలేదు. కానీ బిజినెస్ పార్టనర్ ల దగ్గర ఈ రహస్యాలను బహిర్గత పరచి, వారి అభిప్రాయాలు సేకరించింది. అలా ఈ విషయాలు బయటకు పొక్కాయి.

వ్యాపారమే పరమావధి..

భారత్ లో ఫేస్ బుక్ ప్రయాణం సజావుగా సాగాలంటే, ప్రభుత్వానికి సాగిలపడాల్సిందే. అధికార బీజేపీకి వంతపాడాల్సిందే. అంటే విద్వేష ప్రసంగాలు, విద్వేషపూరిత ప్రచారాలు చేసే మతతత్వ ఫేస్ బుక్ పేజీల జోలికి యాజమాన్యం వెళ్లకూడదు. మెటా యాజమాన్యం కిందకు వచ్చే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వాట్సప్.. ఇలా ఏ ప్లాట్ ఫామ్ లో అయినా విద్వేష ప్రసంగాలకు వారు కళ్లెం వేయకూడదు. అదే జరిగితే భారత్ లో ఫేస్ బుక్ మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇక్కడి ఆఫీస్ లు, ఉద్యోగులు ముప్పు ఎదుర్కొంటారనే హెచ్చరికలు కూడా వారికి చేరిపోయాయి. అందుకే ఫేస్ బుక్ బీజేపీకి మోకరిల్లింది. విద్వేషాన్ని వ్యాపింపజేయడంలో నిస్సహాయంగా ఉండి తనవంతు ప్రోత్సాహం అందిస్తోంది.

ట్విట్టర్ తో ఇలాంటి సమస్యలు ఉండటం వల్లే.. ఆమధ్య బీజేపీ నాయకులు బహిరంగంగానే ట్విట్టర్ యాజమాన్యంపై నిప్పులుచెరిగారు. కాళ్లబేరానికి తెచ్చుకోవాలని చూశారు. కానీ అది సాధ్యపడలేదు. ఫేస్ బుక్ మాత్రం వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని జరిగిన తప్పుల్ని బయటపెట్టడానికి భయపడుతోంది. పరోక్షంగా మరిన్ని తప్పులకు, మారణహోమానికి కారణమవుతోంది.

First Published:  18 Aug 2022 9:51 AM GMT
Next Story