Telugu Global
National

డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించి మూఢనమ్మకాలు వ్యాప్తి చేస్తారా..?

విద్యను కాషాయీకరణ చేసే ప్రక్రియ దేశంలో వేగంగా జరుగుతోందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం వల్ల పిల్లల్లో మూఢనమ్మకాలు, అశాస్త్రీయ పోకడలు పెరిగే ముప్పుందని అభిప్రాయపడ్డారు నిపుణులు.

డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించి మూఢనమ్మకాలు వ్యాప్తి చేస్తారా..?
X

మానవ పరిణామ క్రమంలో డార్విన్ సిద్ధాంతమే ఇప్పటి వరకూ ప్రామాణికంగా ఉంది. అది మినహా మిగతా ఆలోచనలు, సిద్ధాంతాలన్నీ.. వట్టి కల్పితాలు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ డార్విన్ సిద్ధాంతాన్నే NCERT పుస్తకాలనుంచి తొలగించింది కేంద్రం. పదో తరగతి సిలబస్ నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తీసేసింది. మరి భవిష్యత్ తరాలు.. మానవులు ఎలా ఉద్భవించారంటే ఏం చెబుతారు..? మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తారా..? సైన్స్ ని సమాధి చేస్తారా..? అంటూ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.

డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం వల్ల పిల్లల్లో మూఢనమ్మకాలు, అశాస్త్రీయ పోకడలు పెరిగే ముప్పుందని అభిప్రాయపడ్డారు నిపుణులు. టాటా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌, ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సహా దేశంలోని వివిధ ఐఐటీలకు చెందిన 1,800 మంది నిపుణులు ఈ వ్యవహారంపై ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని విస్మరిస్తే రాబోయే తరం దేన్నీ అర్థం చేసుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. డార్విన్‌ సిద్ధాంతం సాయం లేకుండా చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని అధ్యయనం చేయడం కుదరదన్నారు. ప్రజల్లో విజ్ఞానం పెంపొందించాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం అని చెప్పారు.

ఎందుకీ వింత పోకడలు..

విద్యను కాషాయీకరణ చేసే ప్రక్రియ దేశంలో వేగంగా జరుగుతోందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు శాస్త్రీయ దృక్పథాలను కూడా మార్చేందుకు పూనుకుంది కేంద్రం. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడమంటే, మానవ పుట్టుక విషయంలో కల్పితాలు ప్రచారం చేసినట్టే లెక్క. మానవుడు కోతినుంచి ఉద్భవించాడని డార్విన్ చెప్పారు. ఆ తర్వాత ఆయన సైద్ధాంతికతను ఆధారంగా చేసుకుని కోతినుంచి హోమోసేపియన్ గా మానవుడి పరిణామ క్రమాన్ని వివరించారు శాస్త్రవేత్తలు. ఈ వాస్తవిక వాదాన్ని కనుమరుగు చేస్తే అసలు మానవుడు ఎలా ఉద్భవించాడనే ప్రశ్నకు పిల్లల వద్ద సమాధానం ఉండదు. అలాంటి పరిస్థితి తేవద్దని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  10 May 2023 5:20 AM GMT
Next Story