Telugu Global
National

బీఆర్ఎస్ అనుబంధ శాఖలపై కసరత్తు.. ఢిల్లీ నుంచే పార్టీ కార్యకలాపాలు

2023 మార్చి నాటికి వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న పార్టీ భవనం పూర్తి అవుతుంది. అప్పడు అనుబంధ సంఘాలకు కూడా అందులో కార్యాలయాలను కేటాయించనున్నారు.

బీఆర్ఎస్ అనుబంధ శాఖలపై కసరత్తు.. ఢిల్లీ నుంచే పార్టీ కార్యకలాపాలు
X

టీఆర్ఎస్ పేరును దసరా రోజు బీఆర్ఎస్‌గా మార్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం రావడానికి మరి కొంత సమయం పడుతుంది. కానీ, ఈ లోగా పార్టీ అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇకపై ఢిల్లీ నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కానీ, ఇప్పుడే ఆ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేద‌ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ లక్ష్యం మొత్తం 2024 సార్వత్రిక ఎన్నికలే అని తెలుస్తున్నది. ఈ లోగా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు.

రైతులు, ఆదివాసీలు, దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి. ఈ పథకాల వల్ల కేసీఆర్, టీఆర్ఎస్‌కు మంచి పేరు వచ్చింది. దీంతో దేశమంతా వీటిపై ప్రచారం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. రైతు, దళిత, ఆదివాసీ అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీలోని తాత్కాలిక కార్యాలయంలో పలువురు రైతు, కార్మిక, కుల సంఘాల నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. పార్టీకి అనుబంధంగా పలు రాష్ట్రాల్లో ఈ సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఆయా సంఘాల బాధ్యులను కూడా నియమించనున్నారు. పార్టీ కంటే ముందుగా అనుబంధ సంఘాల ద్వారానే విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.

2023 మార్చి నాటికి వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న పార్టీ భవనం పూర్తి అవుతుంది. అప్పడు అనుబంధ సంఘాలకు కూడా అందులో కార్యాలయాలను కేటాయించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మైనింగ్, ఇండస్ట్రీస్‌లలో కార్మిక సంఘాలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక పంజాబ్, యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రైతు సంఘాలను బలోపేతం చేయనున్నారు. ప్రతీ రాష్ట్రంలో పార్టీ, దాని అనుబంధ సంఘాల ప్రతినిధులను నియమించడానికి ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. పార్టీ పరంగా దక్షిణాది, మహారాష్ట్రలో బాధ్యులను ముందుగా నియమించనున్నట్లు సమాచారం. అనుబంధ సంఘాలను మాత్రం ప్రతీ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు.

First Published:  7 Oct 2022 4:12 AM GMT
Next Story