Telugu Global
National

మోదీ పని ఖతం, పతనం ఖాయం.. సత్యపాల్ సంచలన ఇంటర్వ్యూ

మాజీ గవర్నర్ సత్యపాల్ ఇచ్చిన ఇంటర్వ్యూ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మోదీ పాలన అంతా అవినీతి మయం అన్నారు సత్యపాల్ మాలిక్. చుట్టూ అవినీతి జరుగుతున్నా.. ఆయనకు పెద్దగా పట్టింపు లేదన్నారు.

మోదీ పని ఖతం, పతనం ఖాయం.. సత్యపాల్ సంచలన ఇంటర్వ్యూ
X

2024లో మోదీకి అన్ని దారులు మూసుకుపోయాయా..? ఇప్పటి వరకు ప్రభుత్వ విజయాలు అని చెప్పుకుంటున్నవన్నీ, బీజేపీ వైఫల్యాలేనా..? చివరకు దేశభక్తిని కూడా రాజకీయం చేస్తున్నారా..? అవినీతిని చూసీ చూడనట్టు మోదీ వదిలేస్తున్నారా..? వీటన్నిటిపై మాజీ గవర్నర్ సత్యపాల్ ఇచ్చిన ఇంటర్వ్యూ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఎవరీ సత్యపాల్..?

మోదీపై తీవ్ర ఆరోపణలు చేసిన సత్యపాల్ ఆషామాషీ వ్యక్తి కాదు. పక్కా బీజేపీ మనిషి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కాంగ్రెస్ కి ఏమాత్రం సంబంధం లేని రాజకీయ నాయకుడు. జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు సమయంలో ఆ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. గోవా, మేఘాలయకు కూడా గవర్నర్ గా పనిచేశారు. కానీ ఇప్పుడాయన మోదీపై విరుచుకుపడుతున్నారు. మోదీ అసమర్థతను ఎక్కువరోజులు ఎవరూ కప్పిపుచ్చలేరంటున్నారు మాలిక్.

పుల్వామా దాడికి కారణం ఎవరో తెలుసా..?

2019 ఫిబ్రవరి 14న కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది CRPF జవాన్లు చనిపోయారనే విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో CRPF జవాన్లు ప్రయాణించడానికి విమానాన్ని కోరారని, దానికి కేంద్ర హోం శాఖ అనుమతి ఇవ్వకపోవడం వల్లే వారు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని, అందుకే దాడి జరిగిందని కుండబద్దలు కొట్టారు మాలిక్. ఆ విషయం తాను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినా తన నోరు నొక్కేశారన్నారు. పుల్వామా దాడిలో భారత ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందన్నారు. దానివల్లే 40మంది జవాన్లు చనిపోయారని, కానీ నింద పాకిస్తాన్ పై వేసి బీజేపీ ప్రభుత్వం తప్పించుకుందన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార దాడులు, వాటిని దేశభక్తికి ముడిపెట్టి, తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఎలా లాభపడిందో వివరించారు మాలిక్.

పుల్వామా దాడులు జరిగిన ఏడాదే జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్రం. అది కూడా తప్పుడు నిర్ణయం అని చెబుతున్నారు సత్యపాల్ మాలిక్. ప్రధాని అసమర్థత, తెలివి తక్కువ తనానికి అది నిదర్శనం అని చెప్పారు. వెంటనే జమ్మూ కాశ్మీర్ ని ఏకం చేసి ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలన్నారు మాలిక్.

అవినీతిమయం..

మోదీ పాలన అంతా అవినీతి మయం అంటున్నారు సత్యపాల్ మాలిక్. ఆయన చుట్టూ అవినీతి జరుగుతున్నా.. దానికోసం ప్రధాని కార్యాలయం పేరు వాడుకుంటున్నా ఆయనకు పెద్దగా పట్టింపు లేదన్నారు. తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో బీజేపీ నేత రామ్ మాధవ్ తన దగ్గర పైరవీలకు వచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. హైడ్రో-ఎలక్ట్రిక్ స్కీమ్, రిలయన్స్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ ను క్లియర్ చేయాలంటూ రామ్ మాధవ్ తనని సంప్రదించారని, కానీ తాను అంగీకరించలేదన్నారు. 300 కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చని ప్రలోభపెట్టాలని చూశారని, కానీ తాను లొంగలేదని చెప్పుకొచ్చారు.

గోవా గవర్నర్ గా ఉన్నప్పుడు కూడా అక్కడి అవినీతిని ఎప్పటికప్పుడు తాను ప్రధాని మోదీకి చెప్పేవాడినని, ఫలితం తనకు గోవా నుంచి మేఘాలయకు బదిలీ అయిందని అన్నారు మాలిక్. చుట్టూ అవినీతి జరుగుతున్నా రాజకీయ స్వలాభంకోసం మోదీ పట్టించుకునేవారు కాదన్నారు.

అదానీతో సీన్ రివర్స్..

అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీ తీవ్రంగా నష్టపోయారని, ఆ విషయం మారుమూల గ్రామాల్లోకి కూడా వెళ్లిందని చెప్పారు మాలిక్. అదానీ వ్యవహారంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే, ఆయనకు పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, అది చాలా పెద్ద తప్పిదం అన్నారు. 2024 ఎన్నికల్లో దీనికి బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బీబీసీపై ప్రధాని వ్యవహరించిన తీరు సరికాదని, దాని ప్రభావం తప్పక కనపడుతుందని చెప్పారు. ముస్లింల పట్ల ప్రధాని, మంత్రులు వ్యవహరిస్తున్న తీరుసరికాదన్నారు మాలిక్. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమైతే కచ్చితంగా 2024 ఎన్నికల్లో సంచలనాలు నమోదవుతాయన్నారు.

First Published:  15 April 2023 1:57 AM GMT
Next Story