Telugu Global
National

బోరున ఏడుస్తూ రోడ్డెక్కిన పోలీసు...తన్నుకుంటూ తీసుకెళ్ళిన అధికారులు

బోరున ఏడుస్తూ రోడ్డెక్కిన పోలీసు...తన్నుకుంటూ తీసుకెళ్ళిన అధికారులు
X

ఓ కానిస్టేబుల్, కొన్ని రొట్టెలు, కొద్దిగా అన్నం ఓ గిన్నేలో కొద్దిగాపప్పుతో ఉన్న ఓ ప్లేట్ ను పట్టుకొని బోరున ఏడుస్తూ రోడ్డంతా తిరుగుతున్నాడు. రోడ్డు మీద వచ్చిపోయేవాళ్ళకు చూపిస్తున్నాడు. సిగ్నల్ దగ్గర ఆగిన వాహనదారులకు కూడా ప్లేట్ చూపిస్తూ వివరిస్తున్నాడు. జంతువులు కూడా తినని ఈ ఆహారాన్ని మాకు పెడుతున్నారని, రోజుకు 12 గంటల‌కు పైగా పని చేసే మేను మేము ఆకలితో బతకాల్సి వస్తోందని విలపిస్తున్నాడు. అక్కడున్న‌జనాలు అయ్యో అంటూ జాలిపడుతున్నారు. అంతకన్నా వాళ్ళు మాత్రం ఏం చేయగలరు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో పోలీసు సిబ్బందికి నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారనే ఆరోపిస్తూ ఆగస్టు 10, బుధవారం మనోజ్ కుమార్ అనే పోలీసు కానిస్టేబుల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి)కి వ్యతిరేకంగా ఏడుస్తూ నిరసన తెలిపారు.

"మాకిచ్చే ఆహారం మీరు నా ప్లేట్‌లో చూడండి, ఈ ఆహారాన్ని జంతువులు కూడా తినవు, కానీ ఇదే ఆహారాన్ని మాకు రోజు పెడుతున్నారు. ఇది సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, DCP చేసిన మోసం. పోలీసులకు, ఇతర సిబ్బందికి నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారు'' అని మనోజ్ కుమార్ తెలిపారు.

"మా గోడు వినడానికి ఎవరూ లేరు, నేను ఉదయం నుండి ఆకలితో ఉన్నాను," అన్నారాయన.

కుమార్ తన ఆహారపదార్థాల ప్లేట్‌ని తీసుకొని రోడ్డు మీదికి వచ్చిపాదచారులకు, వాహనదారులకు చూపించాడు. ఒకానొక సమయంలో నిరసనగా రోడ్డుపై కూర్చున్నారు.

పోలీసు సిబ్బందికి పౌష్టికాహారం అందించడానికి వారికి ఇచ్చే అలవెన్సులను దాదాపు 30 శాతం పెంచుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చినప్పటికీ నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని ఆయన అన్నారు.


మనోజ్ కుమార్ ఇలా నిరసన తెలుపుతుండగా పోలీసులు వచ్చి అతన్ని కొట్టి లాక్కుపోయి కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళారు.

కాగా, ఆహారం నాణ్యతపై దర్యాప్తు చేస్తున్నామని ఫిరోజాబాద్ పోలీసులు తెలిపారు. ఏడ్చి నిరసన తెలిపిన కానిస్టేబుల్‌కు గత కొన్నేళ్లుగా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు 15 సార్లు శిక్ష పడిందని వారు తెలిపారు. ఈ విషయంలో మనోజ్ కుమార్ దే తప్పంటూ ఫిరోజాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు.

పప్పు, చపాతీలు, అన్నం సహా ఆహార పదార్థాలు పచ్చిగా ఉన్నాయని, నాసిరకంగా ఉన్నాయని ఆరోపిస్తూ మనోజ్ కుమార్ గతం లో కూడా అనేక సార్లు మెస్ లో నిరసన తెలిపాడని పోలీసులు చెప్తున్నారు.

అయితే మనోజ్ కుమార్ ఆరోపణలను మెస్ మేనేజర్ సహజంగానే ఖండించారు. ఆహారం నాణ్యత విషయంలో కుమార్ అనవసరంగా ప్రతిసారీ అరిచేవాడని మెస్ మేనేజర్ తెలిపారు.

ఇప్పుడు మనోజ్ కుమార్ ను సస్పెండ్ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

"కెప్టెన్ సార్ నా సమస్యను వినడానికి ఇష్టపడటం లేదు.RI (రిజర్వ్ ఇన్‌స్పెక్టర్) నన్ను వెంటనే సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నారు." అని కుమార్ అన్నారు, "నేను సమస్య గురించి DGP సార్‌కి చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం లభించ‌లేదు." అన్నాడు మనోజ్

First Published:  11 Aug 2022 6:54 AM GMT
Next Story