Telugu Global
National

ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయి - సిజెఐ రమణ తీవ్ర వ్యాఖ్యలు

కోర్టుల్లో తీర్పులకన్నా ముందే ఎలక్ట్రానిక్ , సోషల్ మీడియాలు తీర్పులు ఇచ్చేస్తున్నాయని ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు మీడియాల్లో జరుగుతున్న చర్చలు ప్ర‌జాస్వామ్యానికి హానికరం అని రమణ అన్నారు.

ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయి - సిజెఐ రమణ తీవ్ర వ్యాఖ్యలు
X

మీడియా తన బాధ్యతలను అతిక్రమించి, ప్రజాస్వామ్యాన్ని తిరోగ‌మ‌న దిశ‌గా తీసుకెళ్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎన్వీ రమణ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ, ఆయ‌న శనివారం ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయించడం కష్టంగా ఉన్న సమస్యలపై వారు "కంగారూ కోర్టులను నడుపుతున్నారు.' అన్నారు.

రాంచీలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ స్టడీ & రీసెర్చ్ ఇన్ లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయ‌న ప్రసంగిస్తూ...

''ఈరోజుల్లో మీడియా అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటోంది. కానీ, వాస్తవం ఏదో, ఏది మంచో, ఏది సరైందో నిర్ధారించలేకపోతున్నది. మీడియా విచారణలు.. కేసుల్లో మార్గనిర్దేశం చేయలేవు. అలాగే మీడియా ఛానెళ్లు 'కంగారు కోర్టు'లను నడిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో.. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంటోంది.'' అన్నారు రమణ.

"ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంత మేర‌కు జవాబుదారీతనం ఉంది, అయితే ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనం ఉండ‌డం లేదు" అని ఆయన అన్నారు, మీడియా తమ బాధ్యతలను అతిక్ర‌మించ‌డమేకాక వాటిని ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని వెనుకకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు.

సోషల్ మీడియా ఇంకా అధ్వాన్నంగా ఉందంటూ మీడియా స్వీయ నియంత్రణ పాటించాల‌ని పిలుపునిచ్చారు. "ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుతున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు అవగాహన కల్పించడానికి, దేశాన్ని ఉత్తేజపరిచేందుకు వారి గ‌ళాల‌ను ఉపయోగించాలి" అని ఆయన అన్నారు.

"న్యాయమూర్తులపై భౌతిక దాడులకు పాల్పడ్డారన్న ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్‌లకు వారి ఉద్యోగాల సున్నితత్వం కారణంగా పదవీ విరమణ తర్వాత కూడా భద్రత కల్పిస్తున్నామని, కానీ న్యాయమూర్తులకు మాత్రం ఎలాంటి రక్షణ కల్పించడం లేదు" అని జ‌స్టిస్ ర‌మ‌ణ అన్నారు.

"ఈ రోజుల్లో, న్యాయమూర్తులపై పెరుగుతున్న భౌతిక దాడులను మనం చూస్తున్నాము... న్యాయమూర్తుల జీవితాలకు ఎలాంటి భద్రత, కానీ భద్రతకు భరోసా కానీ లేకుండా పోతున్నాయి. దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తులు ఉన్న సమాజంలోనే న్యాయమూర్తులు జీవించవలసి ఉంటుంది" అని సిజెఐ ర‌మ‌ణ అన్నారు.


First Published:  23 July 2022 10:51 AM GMT
Next Story