Telugu Global
National

హిమాచల్ లో కొన‌సాగుతున్న‌ పోలింగ్.. డబుల్ ఇంజన్ డౌటే

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, త్వరలో జరగబోయే గుజరాత్ సహా ఏడాదిన్నర తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా ఆ ప్రభావం కనిపించే అవకాశముంది.

హిమాచల్ లో కొన‌సాగుతున్న‌ పోలింగ్.. డబుల్ ఇంజన్ డౌటే
X

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొన‌సాగుతోంది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను 412మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 55.9 లక్షలమంది ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కువినియోగించుకోవాల్సి ఉంది. గతంలోకంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి.

డబుల్ ఇంజన్ డౌటే..

హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈసారి విజయావకాశాలు తక్కువేనని తేలిపోయింది. అక్కడి ఆనవాయితీ ప్రకారం ప్రజలు వరుసగా ఏ పార్టీకి అధికారం అప్పగించలేదు. ఒకసారి బీజేపీ అయితే, మరోసారి కాంగ్రెస్. పోనీ ఆ ఆనవాయితీని పక్కనపెట్టినా, స్థానిక పరిస్థితులు బీజేపీకి మాత్రం అనుకూలంగా లేవు. మోదీ సభలకు కూడా స్పందన అంతంతమాత్రంగానే ఉండటంతో హిమాచల్ లో పోలింగ్ కి ముందే బీజేపీ డీలా పడింది.

ఓల్డ్ పెన్షన్ గట్టెక్కించేనా..

ఓపీఎస్ కోసం అక్కడి ఉద్యోగులు తీవ్ర అందోళనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే పాత పెన్షన్ విధానం అమలులోకి తెస్తామని నేతలు హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీ కూడా జనంలోకి బలంగా వెళ్లింది. అటు బీజేపీ మాత్రం పెన్షన్ విధానంపై ఇబ్బంది పడుతోంది. నిరుద్యోగం విషయంలో ప్రభుత్వం యువతకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉంది. ముఖ్యంగా సీఎం జైరాం ఠాకూర్ పై అసమర్థ ముఖ్యమంత్రి అనే ముద్రపడింది.

మొత్తం 7,884 పోలింగ్‌ కేంద్రాల్లో 397 కేంద్రాలు మంచుతో నిండి అత్యంత సంక్లిష్టంగా ఉంటాయి. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో కాజాలోని తషిగాంగ్‌ పోలింగ్‌ బూత్‌ దేశంలోనే అత్యంత ఎత్తులో ఉండే పోలింగ్‌ కేంద్రం. ప్రస్తుతం హిమాచల్ అసెంబ్లీకి పోటీ పడుతున్న బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో 85శాతం మంది కోటీశ్వరులు కావడం విశేషం. ఇలాంటి ప్రత్యేకతలెన్నో హిమాచల్ ఎన్నికల్లో ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, త్వరలో జరగబోయే గుజరాత్ సహా ఏడాదిన్నర తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా ఆ ప్రభావం కనిపించే అవకాశముంది. ముఖ్యంగా హిమాచల్ లో గెలుపు బాధ్యతల్ని తన భుజాన వేసుకుని ప్రచార పర్వాన్ని ముందుకు నడిపించారు ప్రియాంక గాంధీ. ఆమెకు రాజకీయ భవిష్యత్తుకి కూడా ఈ గెలుపు అత్యంత అవసరం.

First Published:  12 Nov 2022 6:36 AM GMT
Next Story