Telugu Global
National

పోస్టల్ బ్యాలెట్ రద్దుకు ఈసీ ప్రతిపాదన

పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాకుండా ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మార్పులు చేయాలని ఈసీ కేంద్ర న్యాయశాఖకు ఇటీవల ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

పోస్టల్ బ్యాలెట్ రద్దుకు ఈసీ ప్రతిపాదన
X

మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. దేశంలో కొన్ని రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో శాసన సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్‌కు మాత్రం దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. కాగా దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణ అధికారులుగా ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తారు. దేశమంతటా దాదాపు కోటి మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, బూత్‌లను ఏర్పాటు చేయడం, ఈవీఎంలు తరలించడం, ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే వరకు ఎన్నికల అధికారులు తమ విధులు నిర్వహిస్తారు.

అయితే ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులు కూడా ఓటర్లే కాబట్టి.. వారు తమ సొంత నియోజకవర్గంలో ఓటు వేయడానికి అవకాశం ఉండదు కాబట్టి.. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగానికి గురవుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొంత మంది ఉద్యోగులు తమకు ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్‌ను తమ వెంట తీసుకెళ్తూ ఉంటారు. చాలా రోజుల పాటు వారితోనే పోస్టల్ బ్యాలెట్ ఉండడం ద్వారా అది దుర్వినియోగానికి గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

పోస్టల్ బ్యాలెట్లు తమకు అనుకూలంగా మార్చుకుని అభ్యర్థులు గెలిచే అవకాశం కూడా ఉంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ద్వారా గెలిచిన అభ్యర్థులను కూడా తరచూ చూస్తుంటాం. అయితే కొంత మంది రాజకీయ నాయకులు తమ బలం ఉపయోగించి, డబ్బు ఆశ చూపి పోస్టల్ బ్యాలెట్లు తమకు అనుకూలంగా వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాకుండా ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మార్పులు చేయాలని ఈసీ కేంద్ర న్యాయశాఖకు ఇటీవల ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

కాగా పోస్టల్ బ్యాలెట్ స్థానంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల వినియోగానికి ఎన్నికల నిర్వహణ చట్టం 1961లోని 18వ నిబంధనకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన ఎన్నికల అధికారి రాజకుమార్, ఎన్నికల కమిషనర్ చంద్ర పాండే సూచించినట్లు అధికారులు తెలిపారు. ఈసీ చేసిన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అధికారులు ఎన్నికల విధుల్లోకి వెళ్లేలోపే వారికి శిక్షణ సమయంలోనే ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు వేసేలా తగిన ఏర్పాట్లు చేస్తారు. దీని ద్వారా పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం కాకుండా ఆస్కారం కలగనుంది.

First Published:  22 Sep 2022 9:59 AM GMT
Next Story