Telugu Global
National

రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల సంఘం మ‌రో ఝ‌ల‌క్ !

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లకు ఇచ్చే హామీల అమలు తదితర వివరాలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.రాజకీయ పార్టీలు ఓటర్లకు ఇచ్చిన హ‌మీల‌పై మరింత జవాబుదారీగా ఉండేలా చేయడానికి, ఎన్నికల సంఘం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల ఖర్చు వివరాలను అందించాలని కోరింది.

రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల సంఘం మ‌రో ఝ‌ల‌క్ !
X

దేశంలో రాజ‌కీయ పార్టీల ఉచిత హామీల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న త‌రుణంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాజ‌కీయ పార్టీల‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీలు ఇచ్చే హ‌మీల అమ‌లు, వ‌న‌రులు త‌దిత‌ర అంశాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అన్ని రాజ‌కీయ పార్టీల‌కు లేఖ‌లు రాసింది. ఎన్నిక‌లకు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది.

రాజకీయ పార్టీలు ఓటర్లకు ఇచ్చిన హ‌మీల‌పై మరింత జవాబుదారీగా ఉండేలా చేయడానికి, ఎన్నికల సంఘం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల ఖర్చు వివరాలను అందించాలని కోరింది.

తాజాగా, ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌ల‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు గ‌ల ఆర్ధిక వ‌న‌రులు, సామాజిక ప‌రిస్థితులు, ఆయా రాష్ట్రాల ఆదాయ వ్యయ‌ వివ‌రాలు, ఏ మేర‌కు హామీలు నెర‌వేర్చారు, వాటికి నిధులను ఎలా తెచ్చారు వంటి వివ‌రాల‌ను అందించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాసిన లేఖ‌లో పేర్కొంది. పార్టీల‌కు అందే విరాళాల వివ‌రాలు కూడా అందించాల‌ని కోరింది. ఈ వివ‌రాల‌తో అక్టోబ‌ర్ 19 వ తేదీ లోగా స‌మాధానం ఇవ్వాల‌ని కోరింది.

అయితే ఈ వివ‌రాలు ఇవ్వ‌డం ఎలా సాద్య‌మ‌ని,ఇప్ప‌టికిప్పుడు వివ‌రాలు స‌మ‌కూర్చాలంటే ఎలా సాధ్య‌ప‌డుతుంద‌ని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను, ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను బ‌ట్టి మేనిఫెస్టోలు రూపొందిస్తామ‌ని అంటున్నాయి. ఇందుకు మ‌రింత స‌మ‌యం ఇస్తే బాగుటుంద‌ని పార్టీలు కోరుతున్నాయి.

ఇటీవ‌లే దేశంలో కొన్ని రాజకీయ పార్టీల గుర్తింపును ర‌ద్దు చేసింది ఈసీ. నామ‌మాత్రంగా ఉన్న పార్టీలు, ఉనికిలో లేని పార్టీల‌ను ర‌ద్దు చేసింది. ఇటువంటి పార్టీల‌ను కేవ‌లం న‌ల్ల‌ధ‌నాన్ని మార్చుకునేందుకు వినియోగించుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సీఈసీ ఆరోపించింది. ఇప్ప‌టికే పొలిటిక‌ల్ పార్టీల‌కు విరాళాల విష‌యంలో కేంద్ర న్యాయాశాఖ‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపింది. రాజకీయ పార్టీలకు నగదు విరాళాలను పరిమితం చేయాలని న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. నగదు విరాళాన్ని 20 శాతం లేదా రూ. 20 కోట్లకు పరిమితం చేయాలని ప్రతిపాదించింది. ఎన్నికల నిధులను నల్లధనాన్ని ప్రక్షాళన చేసేందుకు అనామక రాజకీయ విరాళాలను కూడా నియంత్రించాల‌ని ఎన్నికల సంఘం ప్రతిపాదించిన విష‌యం తెలిసిందే.

First Published:  4 Oct 2022 1:37 PM GMT
Next Story