Telugu Global
National

రిపబ్లిక్ డే చీఫ్ గెస్టుగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా

రిపబ్లిక్‌డే అతిథిగా ఆహ్వానిస్తున్న ఈజిప్టు అధ్యక్షుడిని.. జీ20 సదస్సుకు కూడా ప్రత్యేక అతిథిగా భారత ప్రభుత్వం ఆహ్వానించింది.

రిపబ్లిక్ డే చీఫ్ గెస్టుగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా
X

రిపబ్లిక్ డే చీఫ్ గెస్టుగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసిని భారత ప్రభుత్వం ఆహ్వానించింది. 2023లో జరుగనున్న వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా ఉండనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇటీవల ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఈజిప్టులో పర్యటించారు. ఆ సమయంలో 'ది రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్' అధ్యక్షుడైన అబ్దుల్ ఫతాకు ప్రధాని మోడీ పంపిన ఆహ్వానాన్ని అందించారు. భారత ప్రభుత్వ ఆహ్వానాన్ని అందుకున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ సానుకూలంగా స్పందించారు.

ఇండియా, ఈజిప్టు దేశాలు దౌత్య సంబంధాలు ఏర్పరచుకొని 75 ఏళ్లు పూర్తయ్యింది. భారత్, ఈజిప్ట్ దేశాల మధ్య నాగరికత ఆధారంగా చాలా లోతైన సంబంధాలు ఉన్నాయని.. అందుకే వచ్చే ఏడాదిలో జరుగనున్న జీ-20 సమావేశాలకు కూడా ఆహ్వానించినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల బాలిలో ముగిసిన జీ-20 సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఇండియాకు తదుపరి బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతల్లో ఇండియానే ఉండనున్నది.

ప్రధాని మోడీ కూడా జీ-20కి సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది సమావేశాలను ఎలా నిర్వహించాలి, ఏయే అంశాలను ప్రస్తావించాలనే విషయాలపై విదేశాంగ శాఖతో పాటు ఇతర మినిస్ట్రీలు కూడా సిద్ధపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి రిపబ్లిక్‌డే అతిథిగా ఆహ్వానిస్తున్న ఈజిప్టు అధ్యక్షుడిని.. జీ20 సదస్సుకు కూడా ప్రత్యేక అతిథిగా భారత ప్రభుత్వం ఆహ్వానించింది.

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 నుంచి ప్రతీ సారి మిత్ర దేశాల అధినేతలను ఇండియా అతిథులుగా ఆహ్వానిస్తోంది. కేవలం 1952, 1953, 1966లో తప్ప అన్ని వేడుకల్లో విదేశీ మిత్రులు సంబరాల్లో పాల్గొన్నారు. 2007లో రష్యా ప్రధాని హోదాలో పుతిన్, 2008లో ఫ్రాన్స్ నుంచి నికోలస్ సర్కోజి, 2015లో బరాక్ ఒబామా వంటి కీలక నేతలు హాజరయ్యారు. గత ఏడాది బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆహ్వానించినా.. కోవిడ్ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు అయ్యింది.

First Published:  27 Nov 2022 11:19 AM GMT
Next Story