Telugu Global
National

ఎద్దేళు కర్నాటక: కర్నాటకను మేల్కొలిపిన వారెవ‌రో మీకు తెలుసా ? బీజేపీ ఓటమికి ముఖ్య కారణం వాళ్ళే!

కర్నాటక‌ ఎన్నికల ఫలితాల వెనక కొందరి ధీర్ఘ కాల శ్రమ, మత రాజకీయాల పట్ల వారికున్న వ్యతిరేకత, 6 నెలల పాటు 5 వేల మంది చేసిన‌ కృషి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? వీరెవ్వరూ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదు. దేశంలో, కర్నాటకలో బీజేపీ మత రాజకీయాలతో విసిగిపోయిన కొందరు మేదావులు, లాయర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, వివిధ‌ రంగాల ప్రజలు, అనేక స్వచ్చంద సంస్థలు చేతులు కలిపి సాగించిన పోరాటఫలితం ఇది.

ఎద్దేళు కర్నాటక: కర్నాటకను మేల్కొలిపిన వారెవ‌రో మీకు తెలుసా ? బీజేపీ ఓటమికి ముఖ్య కారణం వాళ్ళే!
X

కర్నాటకలో బీజేపీ ఓటమి, కాంగ్రెస్ అద్భుత గెలుపు గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఫలితాలకు కారణం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కారణమని కొందరు, కాంగ్రెస్ మీద ప్రజల అభిమానం కారణమని కొందరు, బీజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత, దేశవ్యాప్త బీజెపి విధానాలపట్ల వ్యతిరేకత కారణమని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ఫలితాల్లోంచి ఎవరికి ఇష్టమైన కారణాన్ని వారు వెతుక్కుంటున్నారు.

అయితే ఈ ఫలితాల వెనక కొందరి ధీర్ఘ కాల శ్రమ, మత రాజకీయాల పట్ల వారికున్న వ్యతిరేకత, 6 నెలల పాటు 5 వేల మంది చేసిన‌ కృషి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? వీరెవ్వరూ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదు. దేశంలో, కర్నాటకలో బీజేపీ మత రాజకీయాలతో విసిగిపోయిన కొందరు మేదావులు, లాయర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, వివిధ‌ రంగాల ప్రజలు, అనేక స్వచ్చంద సంస్థలు చేతులు కలిపి సాగించిన పోరాటఫలితం ఇది.

కర్నాటకలో బీజేపీ చేసిన మత రాజకీయాలు...ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడానికి వ్యతిరేకంగా జరిగిన హిందుత్వ రాజకీయాలు. సృష్టించిన అల్లర్లు, పబ్బుల మీద దాడులు, వాలంటీర్ డే రోజున ప్రేమికుల మీద దాడులు, అనేక మంది రాష్ట్ర, ఇతర రాష్ట్రాల బీజేపీ నాయకులు, ఇతర హిందుత్వ నాయకులు కర్నాటకలో విద్వేష ఉపన్యాసాలతో ప్రజల మధ్య విభ‌జనలు తీసుకరావడం, కొట్లాటలు సృష్టించడం, ఆకాశాన్నంటిన అవినీతి... తదితర చర్యలను వ్యతిరేకించిన చాలామంది రాజకీయాలకు అతీతంగా చేతులు కలిపారు. ప్రముఖ మేధావులు పురుషోత్తం బిలిమలే, తారారావు, డీయూ సరావతి, రహమత్ తరికెరె, దేవనూరు మహాదేవ, జి.ఎన్. దేవి, AR వాసవి తదితర అనేక మంది నాయకత్వంలో 5 వేలకు పైగా వాలంటీర్లు ఎన్నికలకు 6 నెలల ముందుగానే తమ కృషిని ప్రారంభించారు.

మత రాజకీయాలను, బీజేపీని ఓడించడమే లక్యంగా 'ఎద్దేళు కర్నాటక' (మేలుకో కర్నాటక) అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. సంవత్సరం ముందుగానే 'ఈదినకర్నాటక.కామ్' అనే వెబ్ సైట్ ను ప్రారంభించారు. 'ఎద్దేళు కర్నాటక' లో 112 సంస్థలు చేరాయి. అంతే కాకుండా, కర్నాటక రాజ్య రైతు సంఘం, రాష్ట్ర కార్మిక సంఘాలు, దళిత సంఘర్ష్ సమితి, ఓబీసీ ఫెడరేషన్, పలు ముస్లిం, క్రిస్టియన్ సంస్థలు కూడా 'ఎద్దేళు కర్ణాటక' తో చేతులు కలిపాయి.

6నెలల పాటు ఈ 5 వేల మంది కార్యకర్తలు 149 నియోజక వర్గాల ప్రజల వద్దకు వెళ్ళారు.

★250 వర్క్‌షాప్లు నిర్వహించారు.

★103 నియోజకవర్గాలపై ప్ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

★192 బృందాలు పనిచేశాయి

★5000 వాలంటీర్లు పని చేశారు

★ Eedina.com వెబ్ సైట్ నిర్వహించిన మెగా సర్వే కోసం ఈ వాలంటీర్లు 41,000 కుటుంబాలను కలిశారు.

★650 పోస్టర్లు విడుదల చేశారు

★80 వీడియోలు విడుదల చేశారు.

★7 ఆల్బమ్ లు విడుదల చేశారు

★10 లక్షల మతన్మోద వ్యతిరేక సాహిత్యం కాపీలు పంపిణీ చేశారు.

★1.6 లక్షల మంది ఓటర్లను కొత్తగా నమోదు చేయించారు.

★బీజేపీ వ్యతిరేక పక్షాల ఓట్లు చీల్చే 49 చిన్న పార్టీల అభ్యర్థులు ఉపసంహరించుకునేట్టు చేశారు

★2 ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించారు.

★100 ప్రెస్ మీట్లు పెట్టారు

★4 జాతాల ద్వారా 1కోటి మంది ప్రజలకు సందేశం ఇవ్వగలిగారు.

★75 సదస్సులు నిర్వహించారు. ఇందులో 2 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు.

★ రైతులు, కార్మికులు, దళితులు, మహిళలు, విద్యార్థులు, ఆదివాసీలు తో 50 ధర్నాలు నిర్వహించారు

★31 జిల్లాలు, 150 తాలూకాలాను సందర్శించారు

★ ఫీల్డ్ లో 6 నెలలు 24 గంటలూ 100 మంది పూర్తి సమయం వాలంటీర్లు పని చేశారు.

బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ఈ సంస్థ ప్రముఖులు ఢిల్లీ వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ను, యూపీలో బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతిని కలిసి ఆయా పార్టీల అభ్య‌ర్థులు నిలబడకుండా కృషి చేశారు. 49 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా ఒప్పించగలిగారు.

దీనిపై 'ఎద్దేలు కర్నాటక' సంస్థలో ప్రముఖుడైన పురుషోత్తం బిలిమలె మాట్లాడుతూ, ''దేశం, రాష్ట్రం రాజకీయంగా మునుపెన్నడూ లేని విధంగా పతనమైంది. వాస్తవికత ఆధారంగా దీనికి పరిష్కారాన్ని కనుగొనాలి. ఈ దోపిడీ, మతోన్మాద ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే ప్రధాన అంశం. దుష్టపాలన సాగిస్తున్న‌ పార్టీని ముందుగా ఓడించాలి. ఆ తర్వాత ప్రజల ప్రయోజనాల పునరుద్ధరణ కోసం గెలిచి అధికారంలోకి వచ్చిన వారితో పోరాటం కొనసాగించాలి - ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇదొక్కటే మార్గం'' అన్నారాయన.

''బీజేపీని తిరస్కరిస్తే సరిపోదు. మళ్లీ ఎమ్మెల్యేలను కొనేందుకు వీలు లేని విధంగా వారిని ఓడించడం మన బాధ్యత. ప్రజలకు తీరని కష్టాలు తెచ్చిపెట్టిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చాలా మంది అంగీకరిస్తున్నారు. అందుకోసం బీజేపీని ఓడించే అభ్యర్థికే ప్రజలు ఓటు వేయాలి. మనం విడిపోతే.. మనల్ని చీల్చే పార్టీకే లాభమని'' యోగేంద్ర యాదవ్ కూడా ఎద్దేళు కర్నాటకకు మద్దతు పలికారు.

'ఎద్దేలు కర్ణాటక' సంస్థ ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన మూడు ఓటింగ్ సూత్రాలను ప్రచారం చేసింది. అందుకు అనుగుణంగా పని చేసింది.

1.ఓట్లు వృధా కాకూడదు

2.ఓట్లు చీలిపోకూడదు

3.బీజేపీని ఓడించగల అభ్యర్థికి ఓటు వేయాలి

ఈ మూడు సూత్రాలను ప్రజల్లోకి విస్త్రుతంగా తీసుకెళ్ళగలిగింది ఈ సంస్థ. దీని కారణంగానే అనేక చోట్ల జేడీఎస్ కు వెళ్ళాల్సిన ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్ళాయి. ముఖ్యంగా జేడీఎస్ వైపు ఉన్న ముస్లింలు మూకుమ్మడిగా కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. అలాగే చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఈ సారి ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చాయి.

'ఎద్దేళు కర్నాటక' సంస్థ తన ప్రచారంలో విజయవంతం అయ్యింది. ఆ సంస్థ వాలంటీర్ లు కృషి చేసిన స్థానాల్లో మెజార్టీ బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. కాగా విజయవంతమైన ఈ కృషిని దేశవ్యాప్తం చేయాలని 'ఎద్దేళు కర్నాటక' భావిస్తోంది. ప్రతి రాష్ట్రంలో ప్రజలు ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేసుకొని బీజేపీని ఓడించి దేశంలో మతోన్మాద రాజకీయాలు లేకుండా చేయాలని 'ఎద్దేళు కర్నాటక' సంస్థ ఆశిస్తోంది.

Next Story