Telugu Global
National

ఈడీ విష‌క‌న్యలా మారిందా ?

ప్రభుత్వాలను కూలదోయడానికి, తమ శత్రువులను లొంగదీసుకోవడానికి ఎన్ ఫోర్స్మెంట్ డెరెక్ట‌రేట్‌(ఈడి)ను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసినంతగా ఇప్పటి వరకు ఏప్రభుత్వం చేయలేదు. ఈడీ రాజుల కాలంనాటి విష‌క‌న్యలా మారిందా అనే విమర్షలు వస్తున్నాయి.

ఈడీ విష‌క‌న్యలా మారిందా ?
X

పూర్వం శ‌తృరాజుల‌ను లొంగ‌దీసుకునేందుకు వేగులు,విష‌క‌న్య‌ల‌ను ప్ర‌యోగించేవారట‌ రాజులు. రాచ‌రిక పాల‌న అంత‌మైనా ఆ పోక‌డ‌లు ఇంకా ఆధునిక రాజ‌కీయాల్లో క‌న‌బ‌డుతున్నాయి. అయితే ఇప్పుడు ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆ స్థానంలోకి వ‌చ్చి చేరాయి. అంత‌కుముందు అప్పుడ‌ప్పుడు వినిపించే ఎన్ ఫోర్స్మెంట్ డెరెక్ట‌రేట్‌(ఈడి), ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్‌, సిబిఐ వంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల పేర్లు ఇటీవ‌ల కాలంలో ముఖ్యంగా 2019 త‌ర్వాత నుంచి త‌ర‌చూ ప్ర‌జ‌ల నోళ్ళ‌లో నానుతున్నాయి. కేంద్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ నేతృత్వంలో 2014లో అధికారంలోకి వ‌చ్చిన ఎన్డీయే ప్ర‌భుత్వ అధినేత న‌రేంద్ర‌మోడీ హ‌యాం ప్రారంభ‌మైన‌ప్ప‌టినుంచి ఈడి పేరు ఇంచుమించు ప్ర‌తీరోజూ వినిపిస్తోంది. గ‌తంలో కూడా ఈడీ,సిబిఐ,ఐటి వంటి సంస్థ‌లు సోదాలు, దాడులు చేసిన సంద‌ర్భాలు ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టంత జోరు లేదు. 2014 త‌ర్వాత ఆధునిక రాజ‌కీయం అదుపు త‌ప్పి నిర్దేశిత వ్య‌క్తుల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వ్యాపార, వాణిజ్య‌వేత్త‌లు- సంస్థ‌ల‌పై కంటే రాజ‌కీయ సంబంధాలు ఉన్న నాయ‌కుల‌పైనే ఈడి దాడులు జ‌ర‌గుతున్న ఉదంతాలు చూస్తున్నాం. ఎక్కువ‌గా మ‌నీలాండ‌రింగ్ (పిఎంఎల్ ఎ) ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయ నాయ‌కుల‌ను వేధించి, త‌మ వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నాలో భాగంగానే ఈ దాడులు జ‌రుగుతున్నాయ‌ని దేశ‌వ్యాప్తంగా వ‌స్తున్న ఆరోప‌ణ‌లు. పిఎంఎల్ ఎ చ‌ట్టాన్ని ఈడి దుర్వినియోగాన్ని చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

దేశ‌మంతా కాషాయ‌మ‌యం చేయాల‌న్న ఆలోచ‌న‌తోనే బిజెపి అన్ని రాష్ట్రాల‌లోనూ అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నికై శివ‌సేన నేతృత్వంలో మ‌హావికాస్ అఘాడీ పేరుతో ఏర్పాటైన మ‌హారాష్ట్ర సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టిన ఉదంతాన్ని ఉద‌హ‌రిస్తున్నారు. ఏక్ నాథ్ షిండే ఆధ్వ‌ర్యంలో శివ‌సేన‌లో తిరుగుబాటుకు ముందే షిండే, ఉద్ధ‌వ్ వ‌ర్గాల‌లోని చాలామంది ఎమ్మెల్యేల‌పై ఈడి నిఘా ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఉద్ధ‌వ్ పై క‌క్ష తీర్చుకునేందుకు ఈడి ద్వారా భ‌య‌పెట్టి తిరుగుబాటును బిజెపి ప్రోత్స‌హించింద‌నేది ప్ర‌త్య‌క్ష ఉద‌హ‌ర‌ణ అంటున్నారు. ముఖ్యంగా ఏక్‌నాథ్‌ శిండే తిరుగుబాటుకు మందు ఆయన వర్గంలో చేరిన కొందరిపై ఈడీ దర్యాప్తులు చేసింది. వీరిలో ప్రతాప్‌ సర్‌నాయిక్, అర్జున ఖోత్కర్, యవ్వంత్‌ జాదవ్, భావనా గావ్లీ తదితరులున్నారు. వీరిని కూడా గతంలో ఈడీ విచారించింది.

ముఖ్యంగా ప్రతాప్‌ సర్‌నాయక్‌కు చెందిన రూ. 11.35 కోట్లు విలువైన ఆస్తులను జప్తీ చేయగా యశ్వంత్‌ జాధవ్‌కు సంబంధించిన 40 ప్రాపర్టీలు జప్తు చేశారు. వీటిలో ముంబై బైకలాలోని 26 ఫ్లాట్లున్నాయి. ప్రస్తుతం వీళ్ళంతా బీజెపి స్పాన్సర్డ్ షిండే వర్గంలో ఉన్నారు. వారిపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు ఆగిపోయింది.

ఎంవిఎ ప్ర‌భుత్వంలో ఉన్న మంత్రులు అనిల్ దేశ్ ముఖ్‌, న‌వాబ్ మాలిక్ లు ఇప్ప‌టికే ఈడి కేసుల్లో జైలులో ఉన్నారు.

ఇది కేవ‌లం మ‌హారాష్ట్ర‌కే ప‌రిమితం కాలేదు. ఎక్క‌డెక్క‌డ బిజెపియేత‌ర ప్ర‌భుత్వాలు ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో ఈడి దాడులు ప్ర‌తిప‌క్ష శిబిరాల్లో రాజ‌కీయ తిరుగుబాటుకు కార‌ణ‌మ‌య్యాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, తాజాగా జార్ఖండ్‌, బెంగాల్,గోవా రాష్ట్రాల్లో ఆ ప్ర‌య‌త్నాలు జ‌ర‌గుతున్నాయి. ఢిల్లీలోని ఆప్ ప్ర‌భుత్వంలో మంత్రి స‌త్యేంద్ర జైన్ ఇప్ప‌టికే జైలులో ఉన్నారు. కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబ‌రం, ఆయ‌న కుమారుడు కార్తీ, రాజ్య‌స‌భ‌ మాజీ స‌భ్యుడు కాంగ్రెస్ దివంగ‌త నేత అహ్మ‌ద్ ప‌టేల్‌, హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి భూపేంద‌ర్ హుడాల‌పై కూడా మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై ఈడి కేసులు న‌మోద‌య్యాయి.

గోవా మాజీ ముఖ్యమంత్రులు దిగంబర్ కామత్, చర్చిల్ అలెమావో అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థకు సంబంధించిన లంచం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)కూడా కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కామత్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. 2019లో క‌ర్ణాట‌క కాంగ్రెస్ అధ్య‌క్షుడు డికె శివ‌కుమార్ పై ఈడి కేసున‌మోదు చేసింది.

ఇటీవ‌ల కాలంలో కేర‌ళ లో మాజీ మంత్రి థామ‌స్ ఐజ‌క్ కు ఈడి నోటీసులు ఇచ్చింది. ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ పై గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో ద‌ర్యాప్తు ప్రారంభించింది. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఎస్పీ నేత అజాం ఖాన్‌, ఆయ‌న భార్య‌, కుమారుడిపై కూడా మ‌నీలాండ‌రింగ్ సంబంధిత కేసులు న‌మోదు చేసింది. ప‌శ్చిమ‌ బెంగాల్ లో ముఖ్య‌మంత్రి టిఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ బంధువు అభిషేక్ బెన‌ర్జీ పై కేసులు న‌మోదు చేసింది. అలాగే రెండేళ్ళ‌ క్రితం జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ప‌రూక్ అబ్దుల్లా పై కూడా కేసులు న‌మోదు చేసింది.

ఏ స‌మ‌యంలో ఎన్ని కేసులు..

2012-13 నుండి 2018-2019 మధ్య ఆర్థిక సంవత్సరాల్లో పిఎంఎల్ కింద ఈడి దాఖలు చేసిన కేసుల సంఖ్య గ‌రిష్టంగా 111 నుండి 221 వరకు ఉన్నాయి. 2019-20లో ఉన్న 562 కేసులు, 2021-22లో 1180 కేసులు నమోదు చేశారు. అంటే 2019 నుంచి ఈడి ప్ర‌యోగం చాలా వేగం పుంజుకుంది.

ఇటీవ‌ల కాంగ్రెస్ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, అగ్ర‌నేత రాహుల్ గాంధీ ల‌ను నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ప‌దేళ్ల క్రిత‌మే క్లీన్ చిట్ ఇచ్చినా తాజాగా స‌మ‌న్లు జారీ చేసి గంట‌ల కొద్దీ విచారించింది. దీనిపై శివ‌సేన అధికార ప్రతినిధి, ఎంపి సంజ‌య్ రౌత్ మాట్లాడుతూ .."ఈ కేసును మనీలాండరింగ్ కేసు అని పిలవలేము. ఇది రుణాన్ని తిరిగి చెల్లించడానికి సంబంధించినది. ఈ కేసులో నెహ్రూకి కూడా ఈడీ సమన్లు ​​జారీ చేసి ఆయన స్మారక చిహ్నంపై నోటీసును అతికించినా ఆశ్చర్యం లేదు'' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్ర‌భుత్వం 2004-14 మ‌ధ్య కాలంలో సిబిఐ సంస్థ‌ను ఉప‌యోగించుకునేందుకు ప్ర‌య‌త్నించింది. వైసీపీ అధినేత‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌స్తుత‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన కేసులు ఈ కోవ‌లోకే వ‌స్తాయి. ఎన్డీయే ప్ర‌భుత్వం ఈడీని య‌థేచ్ఛ‌గా ప్ర‌త్య‌ర్ధుల‌ను లొంగ‌దీసుకునేందుకు ఉప‌యోగించుకుంటున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల ఆర్ధిక మూలాల‌ను దెబ్బ‌తీస్తూ లొంగ‌దీసుకునేందుకే ఈడిని బిజెపి ప్ర‌యోగిస్తున్న‌ద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మనీ-లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ ఎ)ప్రకారం, నేరారోపణ లేనప్పటికీ, ఆస్తులను అటాచ్ చేయడానికి ఈడీ కి అధికారం ఉండ‌డంతో అది సీబీఐ కంటే శక్తివంతమైన సాధనంగా మారింది. దీంతో ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌ నాయ‌కుల‌ను బెదిరించేందుకు ఈడి బాగా ఉప‌యోగ‌ప‌డుతోంద‌నే వాద‌న విన‌బ‌డుతోంది. బిజెపి నేతృత్వంలో న‌రేంద్ర మోడీ ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఈడి కేసులు, దాడులు పెర‌గ‌డంతో ఇది ' మోడీ స‌ర్కారా..? ఈడీ స‌ర్కారా..!?' అనే ప్ర‌శ్న‌లు విన‌వ‌స్తున్నాయి.

అందుకేనా కెసిఆర్ కు బెదిరింపులు..?

తెలంగాణలో అధికారంలోకి వ‌చ్చేందుకు బిజెపి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇత‌ర రాష్ట్రాల్లో వ‌లె తెలంగాణ‌ లో అవ‌కాశాలు లేనందున నేరుగా ముఖ్య‌మంత్రి కెసిఆర్ కే హెచ్చ‌రిక‌లు చేస్తూ బెదిరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఎప్ప‌టినుంచో కెసిఆర్ పై ఈడి దాడులు చేస్తుంది..అక్ర‌మాస్తులు వెలికి తీస్తుందంటూ బెదిరించేవారు. గ‌త నెల్లో మ‌రో అడుగు ముందుకేసి త్వ‌ర‌లోనే కెసిఆర్‌, ఆయ‌న త‌న‌యుడు రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఆస్తుల‌పై ఈడి దాడులు చేస్తుంది చూసుకోండంటూ స‌వాల్ విసిరారు. బాధ్య‌త గ‌ల ఎంపిగా బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడిగా సంజ‌య్ అలా హెచ్చ‌రించారంటే ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్) పై ఆ పార్టీ నాయ‌కుల‌కు ఉన్న న‌మ్మ‌కం, విశ్వాసం తేట‌తెల్లం అవుతోంది. అంటే ఈడీకి ముందుగానే కొన్ని సూచ‌న‌లు ఇచ్చి మ‌రీ దాడుల‌కు పురికొల్పుతోందా అనే సందేహాలు క‌లుగుతున్నాయ‌ని ప‌రిశీల‌కులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఈడీ అంటే ఏమిటి?

విదేశీ మారక ద్రవ్య సంబంధిత నేరాలపై నిఘా ఉంచేందుకు 1956లో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)ని ఏర్పాటు చేశారు. కేంద్రంలోని కాంగ్రెస్, బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మరింత శక్తివంతమైన కోరలను అందించింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం 2002లో మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఆమోదించింది.అయితే 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యుపిఎ) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది. తర్వాత, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ ఏజెన్సీ ద్వారా మనీలాండరింగ్ కేసులపై 2019 నుంచి అణ‌చివేత‌లు వేగం పుంజుకున్నాయి

First Published:  2 Aug 2022 8:00 AM GMT
Next Story