Telugu Global
National

ఈసీ కీలక నిర్ణయం.. ఎన్నికల పోలింగ్ డేట్‌లో మార్పు

మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని ఈసీఐ స్పష్టం చేసింది.

ఈసీ కీలక నిర్ణయం.. ఎన్నికల పోలింగ్ డేట్‌లో మార్పు
X

ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 9నే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం తెలంగాణలో నవంబర్ 30న, మిజోరాంతో పాటు ఛత్తీస్‌గఢ్ తొలి ఫేజ్ నవంబర్ 7న, మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ రెండో ఫేజ్ నవంబర్ 17న, రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 23న ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. అయితే ఈ షెడ్యూల్‌లో కీలక మార్పు చేస్తున్నట్లు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాజస్థాన్‌లో షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న జరగాల్సిన పోలింగ్‌ను రెండు రోజుల తర్వాత నవంబర్ 25కి మార్పు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో మార్పు చేస్తూ తాజాగా సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజస్థాన్‌లో నవంబర్ 23న ముహూర్తాలు ఉండటంతో భారీ ఎత్తున వివాహ కార్యక్రమాలతో పాటు శుభకార్యాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, మీడియా ప్రతినిధులు ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్లాయి. రాజస్థాన్‌లో ఆ రోజు ప్రజలు భారీగా ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటం వల్ల పోలింగ్ శాతం భారీగా పడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదీని మారుస్తూ సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 30న విడుదల కానుండగా.. నవంబర్ 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 7న నామినేషన్ల పరిశీలన జరుగనున్నది. ఇక నవంబర్ 9లోగా నామినేషన్లను ఉపసంహరించుకునే వీలుంది. నవంబర్ 25న పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని ఈసీఐ స్పష్టం చేసింది.






First Published:  11 Oct 2023 1:10 PM GMT
Next Story