Telugu Global
National

సీబీఐ నన్ను వేధించింది.... అమిత్ షా సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాను గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు మోడీని తప్పుడు కేసులో ఇరికించాలని సీబీఐ తనపై ఒత్తిడి తెచ్చిందని, అయినా దాని గురించి బీజేపీ హంగామా చేయలేదని షా అన్నారు.

సీబీఐ నన్ను వేధించింది.... అమిత్ షా సంచలన ఆరోపణలు
X

కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలో సీబీఐ తనను వేధించిందని, తనపై విపరీతమైన ఒత్తిడి తెచ్చిందని, దేశ హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆరోపించారు. గుజరాత్‌లో జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాని నరేంద్ర మోడీపై కల్పిత కేసును రూపొందించాలని సిబిఐ తనపై ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో జరిగిన 'న్యూస్ 18 రైజింగ్ ఇండియా' కార్యక్రమంలో మోడీ ప్రభుత్వం కేంద్ర సంస్థల దుర్వినియోగంపై ప్రతిపక్షాల ఆరోపణల మీద‌ షా స్పందించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాను గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు మోడీని తప్పుడు కేసులో ఇరికించాలని సీబీఐ తనపై ఒత్తిడి తెచ్చిందని, అయినా దాని గురించి బీజేపీ హంగామా చేయలేదని షా అన్నారు.

కోర్టు దోషులుగా నిర్ధారించడం వల్ల చాలా మంది రాజకీయ నాయకులు శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారని అమిత్ షా అన్నారు. రాహుల్ తన కేసును ఉన్నత న్యాయస్థానానికి తీసుకెళ్లడానికి బదులుగా ప్రధాని నరేంద్ర మోడీపై నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.తనపై వచ్చిన నేరారోపణ మీద‌ స్టే కోసం అప్పీల్ చేయకపోవడం, కోర్టును ఎదుర్కోకుండా ఎంపీగా కొనసాగాలని కోరుకోవడం రాహుల్ గాంధీ అహంకారాన్నిసూచిస్తోందని షా అన్నారు.

''యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, రషీద్ అల్వీ సహా 17 మంది నేతలు తమ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఎన్నికైన ప్రజాప్రతినిధి దోషిగా తేలిన వెంటనే తమ స్థానాన్ని కోల్పోతారని ఉత్తర్వులో పేర్కొంది.అప్పుడెవ్వరూ నల్ల బట్టలు ధరించి నిరసన వ్యక్తం చేయలేదు'' అని షా పేర్కొన్నారు.

సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షాను ప్రశ్నించగా, అండమాన్ జైలులో రెండు జీవిత ఖైదులను అనుభవించిన ఏకైక స్వాతంత్య్ర‌ సమరయోధుడు వీర్ సావర్కర్ అని ఆయన బదులిచ్చారు.

సావర్కర్ విషయంలో రాహుల్ ఉపయోగించిన భాష సరికాదని, సావర్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని సొంత పార్టీ సభ్యులే ఆయన‌కు సలహా ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ ఈ అంశంపై తన నానమ్మ ప్రసంగాన్ని చదవాలని అమిత్ షా సూచించారు.

First Published:  30 March 2023 8:53 AM GMT
Next Story