Telugu Global
National

పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయి జాగ్రత్త..

ఇప్పటి వరకూ వివిధ సందర్భాల్లో పోలీసులు డ్రోన్లు వాడుతున్నా... వాటిని ప్రైవేటుగా సేకరించేవారు. డ్రోన్ ఆపరేటర్లను తెప్పించి అవసరానికి తగ్గట్టు వాటిని వాడుకునేవారు. ఇప్పుడు పోలీస్ విభాగంలోనే డ్రోన్ టీమ్ లు అందుబాటులోకి వస్తున్నాయి.

పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయి జాగ్రత్త..
X

దొంగల్ని వెంబడించే క్రమంలో పోలీసులు కొన్నిసార్లు వెనకబడిపోవచ్చు. చేతిలో ఓ డ్రోన్ ఉంటే.. దొంగ ఎంతదూరం వెళ్లినా చిటికెలో పైనుంచి ఫొటో తీసేయొచ్చు. ఎక్కడ దాక్కున్నా ఇట్టే పట్టేయొచ్చు, నిఘా పెట్టొచ్చు. ఆ దగ్గర్లో ఉన్న మరో టీమ్ ని పంపించి అరెస్ట్ చేయొచ్చు. రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ పోలీసింగ్ వ్యవస్థ రూపు రేఖల్ని మార్చే అవకాశముంది. దేశంలో తొలిసారిగా డ్రోన్ పోలీస్ యూనిట్ ని తమిళనాడులో ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ఇక్కడ పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు.



రాజుల కాలంలో పదాతి దళం, కాల్బలం, అశ్వసేన లాంటివి ఉండేవి. ఆధునిక యుగంలో రోప్ పార్టీ, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీమ్.. లాంటివి అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు డ్రోన్ టీమ్ వచ్చేసింది. డ్రోన్లు ఆపరేట్ చేయడం, వాటి ద్వారా సమాచారం సేకరించడం, ఫొటోలు, వీడియోలు తీయడం, వాటిని భద్రపరచడం, విశ్లేషించడం అన్నీ ఈ టీమ్ చూసుకుంటుంది. చెన్నైలోని అడయార్‌ లో బెసెంట్‌ నగర్‌ అవెన్యూలో దేశంలోనే తొలి డ్రోన్‌ పోలీస్‌ యూనిట్‌ ని ప్రారంభించారు. ఈ యూనిట్ కి 9 అధునాతన డ్రోన్లు అందించారు. హెవీ లిఫ్ట్ మల్టీరోటర్ డ్రోన్స్, లాంగ్ రేంజ్ సర్వే వింగ్ ప్లేన్ కూడా వీటిలో ఉన్నాయి. 24గంటలు వీటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు.

దొంగల్ని గుర్తించడం, పారిపోతున్న వారిని ఛేజ్ చేయడం, ట్రాఫిక్ ని నియంత్రించడం, అప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ కి సహకరించడం, అత్యవసర సమయాల్లో బాధితుల్ని హెవీ లిఫ్టర్ డ్రోన్ల ద్వారా కాపాడటం.. వంటివన్నీ ఈ డ్రోన్ టీమ్ చేస్తుంది. చోరీకి గురైన వాహనాలను గుర్తించడం, పైనుంచి నెంబర్ ప్లేట్లను కూడా సులువుగా ఫొటోలు తీయడం వీటితో సాధ్యం. సముద్రంలో ప్రమాదం సంభవించినా.. డ్రోన్ల ద్వారా లైఫ్ జాకెట్లను అందించే అవకాశాలున్నాయి. ఒకటేంటి.. డ్రోన్ల వాడకంతో ఇన్ని ఉపయోగాలున్నాయా అనేలా వాటిని పోలీస్ విభాగం వాడేందుకు సిద్ధమైంది.

ఇప్పటి వరకూ వివిధ సందర్భాల్లో పోలీసులు డ్రోన్లు వాడుతున్నా... వాటిని ప్రైవేటుగా సేకరించేవారు. డ్రోన్ ఆపరేటర్లను తెప్పించి అవసరానికి తగ్గట్టు వాటిని వాడుకునేవారు. ఇప్పుడు పోలీస్ విభాగంలోనే డ్రోన్ టీమ్ లు అందుబాటులోకి వస్తున్నాయి. తమిళనాడు తరహాలోనే త్వరలో దేశవ్యాప్తంగా ఈ డ్రోన్ పోలీస్ యూనిట్లు అందుబాటులోకి వస్తాయి.

First Published:  7 July 2023 4:58 AM GMT
Next Story