Telugu Global
National

ప్ర‌ధాని మోదీ నివాసంపై డ్రోన్ క‌ల‌క‌లం

డ్రోన్ స‌మాచారం అందిన వెంటనే భ‌ద్ర‌తా సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఢిల్లీ పోలీసుల‌తో క‌లిసి ఆ డ్రోన్‌ను క‌నిపెట్టేందుకు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్టారు.

ప్ర‌ధాని మోదీ నివాసంపై డ్రోన్ క‌ల‌క‌లం
X

ఢిల్లీలోని ప్ర‌ధానమంత్రి మోదీ నివాసంపై డ్రోన్ కెమెరా సంచారం క‌ల‌క‌లం రేపింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున 5 గంట‌ల స‌మ‌యంలో డ్రోన్ సంచారాన్ని గుర్తించిన‌ట్టు ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) నుంచి స‌మాచారం అందిన‌ట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని లోక్ క‌ల్యాణ్ మార్గ్‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధికారిక నివాసం ఉంది. అది నో-ఫ్లై జోన్‌లో ఉంటుంది. అలాంటి ప్రాంతంలోకి డ్రోన్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది.

డ్రోన్ స‌మాచారం అందిన వెంటనే భ‌ద్ర‌తా సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఢిల్లీ పోలీసుల‌తో క‌లిసి ఆ డ్రోన్‌ను క‌నిపెట్టేందుకు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు అనుమానాస్ప‌దంగా ఏదీ క‌నిపించ‌లేద‌ని అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ప్ర‌ధాని నివాసానికి ప‌రిస‌ర ప్రాంతాల‌న్నీ జ‌ల్లెడ ప‌ట్టిన‌ట్టు ఢిల్లీ పోలీసులు ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను కూడా సంప్ర‌దించామ‌ని, ప్ర‌ధాని నివాసం వద్ద ఎలాంటి ఎగిరే ప‌రిక‌రాల‌ను గుర్తించలేదని వారు చెప్పారని వివ‌రించారు.

గ‌తంలో కేజ్రీవాల్ ఇంటిపైనా..

గ‌తంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నివాసం వ‌ద్ద కూడా ఒక అనుమానాస్ప‌ద డ్రోన్ సంచ‌రించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కేజ్రీవాల్ నివాసం కూడా నో ఫ్లై జోన్‌లోనే ఉంది. ఈ నేప‌థ్యంలో డ్రోన్ల వ్య‌వ‌హారం భ‌ద్రతా సిబ్బంది వైఫ‌ల్యాన్ని తేట‌తెల్లం చేస్తోంది. దీనిపై ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్న‌ది వేచిచూడాలి.

First Published:  3 July 2023 5:48 AM GMT
Next Story