Telugu Global
National

టీచర్లకు డ్రెస్ కోడ్.. జీన్స్, టీ షర్ట్స్, లెగ్గిన్స్ నిషేధం

మహిళా టీచర్ల విషయానికొస్తే లెగ్గిన్స్ నిషేధిస్తున్నామన్నారు. చుడీదార్ లు వేసుకోవాలి, లేదా చీర కట్టుకోవాలి. పార్టీ వేర్ డ్రస్ లు వద్దని కండిషన్లు పెట్టారు.

టీచర్లకు డ్రెస్ కోడ్.. జీన్స్, టీ షర్ట్స్, లెగ్గిన్స్ నిషేధం
X

ప్రభుత్వ టీచర్లు హుందాగా ఉండాలి. వారిని పిల్లలు అనుసరిస్తారు, అనుకరిస్తారు, మంచి అలవాట్లు వారినుంచే నేర్చుకుంటారు. అలాంటి టీచర్లు.. స్కూల్ కి వచ్చేటప్పుడు హుందాగా లేకపోతే ఎలా..? జీన్స్, టీషర్ట్స్ తో వస్తే పిల్లలకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు..? మహిళా టీచర్లు లెగ్గిన్స్ తో వస్తే పిల్లల స్పందన ఎలా ఉంటుంది..? టీచర్లకు ఇలాంటి ప్రశ్నలు సంధించింది అసోం విద్యాశాఖ. వెంటనే వారికి డ్రెస్ కోడ్ అమలులోకి తెచ్చింది. విద్యార్థులు యూనిఫాం వేసుకున్నట్లే.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకూ డ్రెస్‌ కోడ్‌ నిర్ణయించింది.

స్కూల్ కి వచ్చే సమయంలో మగ టీచర్లు ఫార్మల్ వేర్ లో రావాలి. టీ షర్ట్ లు, జీన్స్ లు పూర్తిగా నిషేధం. బ్రైట్ కలర్ షర్ట్ లు వేసుకో కూడదు. పార్టీవేర్ అసలే వద్దు అని చెప్పారు అసోం విద్యా శాఖ మంత్రి డాక్టర్ రనోజ్. ఇక మహిళా టీచర్ల విషయానికొస్తే లెగ్గిన్స్ నిషేధిస్తున్నామన్నారు. చుడీదార్ లు వేసుకోవాలి, లేదా చీర కట్టుకోవాలి. పార్టీ వేర్ డ్రస్ లు వద్దని కండిషన్లు పెట్టారు. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలన్నారు మంత్రి రనోజ్. అలా పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కొన్ని పాఠశాల్లోని ఉపాధ్యాయులు తమకు నచ్చిన దుస్తులు వేసుకొని విధులకు హాజరవుతున్నారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటోంది అసోంలోని బీజేపీ ప్రభుత్వం. డ్రెస్ కోడ్ పై ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి నారాయణ్‌ కౌన్వర్‌ తాజాగా ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే రూల్‌ బుక్‌ అందుబాటులోకి తెస్తామన్నారు. కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డ్రెస్ కోడ్ విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ.. ఇలా కండిషన్లు పెట్టడం సరికాదంటున్నారు.

First Published:  20 May 2023 4:01 PM GMT
Next Story