Telugu Global
National

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

నాలుగో రౌండ్ కూడా ముగిసిన తర్వాత సీఈసీ రాజీవ్ కుమార్‌, ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండే సంతకం చేసి గెలిచిన ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు.

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
X

యశ్వంత్ సిన్హాపై ఘనవిజయం

అంచనాలకు మించిన మెజార్టీ

క్రాస్ ఓటింగ్ చేసిన టీఎంసీ ఎంపీలు

అభినందనలు తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, యశ్వంత్ సిన్హా

రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Elections) అధికార ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) విపక్షాల‌ అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. దీంతో భారత 15వ రాష్ట్రపతిగా ఆమె ఎన్నికయ్యారు. ఈ నెల 18న పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన కౌంటింగ్ ఇవాళ పార్లమెంట్‌‌తో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలలో నిర్వహించారు. మరో రౌండ్ మిగిలి ఉండగానే.. సగానికి పైగా ఓట్లు (ఎలక్టోరల్ కాలేజీ) సాధించి ఆమె రాష్ట్రపతి పీఠాన్ని దక్కించుకున్నారు ద్రౌప‌ది ముర్ము. స్వతంత్ర భారత దేశంలో రాష్ట్రపతి పదవి చేపట్టనున్న తొలి ఆదివాసీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. దీంతో కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అధికార ఎన్డీయే తరఫున జార్ఖండ్ గవర్నర్, ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును నిలబెట్టారు. ఆమెకు ఎన్టీయే పార్టీలతో పాటు వైసీపీ, బీజేడీ, టీడీపీ, జేఎంఎం వంటి ఎన్డేయేతర పార్టీలో కూడా మద్దతనిచ్చాయి. ఇక విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హాను నిలబెట్టారు. దీంతో రాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ అనివార్యం అయ్యింది. 18న పోలింగ్ జరగగా.. ఇవాళ కౌంటింగ్ నిర్వహించారు.

మొదటి రౌండ్ నుంచి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 31 ప్రాంతాల్లో కౌంటింగ్ నిర్వహించారు. ఢిల్లీలోని పార్లమెంటులో మొదటిగా ఎంపీల ఓట్లను లెక్కించారు. ఎంపీల ఓట్లలో 3,78,000 విలువైన ఎలక్టోరల్ కాలేజీకి చెందిన 540 ముర్ముకు దక్కగా.. 1,45,600 విలువైన 208 ఓట్లు యశ్వంత్ సిన్హాకు దక్కాయి. దీంతో తొలి రౌండ్‌లోనే ద్రౌపది ముర్ము దూసుకొని పోయారు. ఈ రౌండ్‌లో 15 ఓట్లు చెల్లలేదు.

ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లోని మొదటి 10 రాష్ట్రాల ఓట్లను లెక్కించారు. ద్రౌపది ముర్ముకు 4,83,299 విలువైన 1,349 ఓట్లు దక్కగా.. యశ్వత్ సిన్హాకు 1,79,876 విలువైన 537 ఓట్లు దక్కాయి. దీంతో రెండో రౌండ్‌లోనూ ముర్ము స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించారు.

రాత్రి 8 గంటలకు మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఈ రౌండ్‌లో ద్రౌపది ముర్ముకు 2,161 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు దక్కాయి. ఎలక్టోరల్ కాలేజీలో సగానికి పైగా ఓట్లు ద్రౌపది ముర్ముకే దక్కడంతో ఆమె విజేతగా నిలిచారు. మరో రౌండ్‌ కౌంటింగ్ ప్రస్తుతానికి కొనసాగుతున్నది. అయితే ఇప్పటికే ద్రౌపది ముర్ము గెలవడంతో ఎన్డీయే పార్టీలు ఆనందంలో మునిగిపోయాయి. ముర్ముకు మొత్తంగా 70 శాతానికి పైగా ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఢిల్లీతో పాటు ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశాలో సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగో రౌండ్ కూడా ముగిసిన తర్వాత సీఈసీ రాజీవ్ కుమార్‌, ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండే సంతకం చేసి గెలిచిన ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. దీన్ని ఈ నెల 25న జరిగే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్బంగా చదువుతారు.

కాగా, రాష్ట్రపతి ఎన్నికలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తున్నది. తమ పార్టీకి చెందిన 15 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసి యశ్వంత్ సిన్హాకు కాకుండా ద్రౌపదికి ఓటేసినట్లు గుర్తించామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా ఉపరాష్ట్రపతి ఎన్నిక నుంచి పార్టీ తప్పుకుంటున్నట్లు పార్టీ నేత అభిషేక్ బెనర్జీ వెల్లడించారు.

ద్రౌపది ముర్ము గెలుపు సందర్భంగా ఆమెను అభినందిస్తూ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఒక లేఖను విడుదల చేశారు. నా తోటి భారత పౌరులతో పాటు నేను కూడా ద్రౌపది ముర్ము కొత్త రాష్ట్రపతిగా ఎన్నిక కావడంపై అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. 15వ రాష్ట్రపతిగా ఆమె భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతారని, రాజ్యాంగం ప్రకారం తన విధులను సక్రమంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ద్రౌపది ముర్మును అభినందించారు.

ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పుష్పగుచ్ఛం అందించి ద్రౌపది ముర్మును అభినందించారు. ఆమె మొదట ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి ఎదిగారని, ముర్ము జీవితం భారతీయులందరికీ స్పూర్తిని ఇస్తుందని మోడీ ప్రశంసించారు. పేద, అట్టడుగు, అణగారిన వర్గాలకు ముర్ము ఒక ఆశా కిరణమని మోడీ అన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ముర్ము.. భరతమాత కూతురు దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికవడం మనందరికీ సంతోషకరమని చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా నూతనంగా ఎన్నికైన ముర్ముకు తన అభినందనలు తెలిపారు.

First Published:  21 July 2022 3:47 PM GMT
Next Story