Telugu Global
National

మతాధిపతి హోదా పొందిన తొలి దళితుడు.. డాక్టర్ పూల ఆంటోని

కార్డినల్ హోదా పొందిన తొలి దళితుడిగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని తొలి వ్యక్తిగా డాక్టర్ పూల ఆంటోని చరిత్ర సృష్టించారు. శనివారం వాటికన్ సిటీలో మొత్తం 20 మంది కార్డినల్స్‌ను పోప్ అభిషేకం చేశారు.

మతాధిపతి హోదా పొందిన తొలి దళితుడు.. డాక్టర్ పూల ఆంటోని
X

హైదరాబాద్ ఆర్చ్ బిషప్ డాక్టర్ పూల ఆంటోని రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాధిపతి (కార్డినల్) హోదా పొందారు. శనివారం రాత్రి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ బాసిలికా‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో (కన్‌సిస్టరీ) పూల ఆంటోని తలపై ఎర్రరంగు బిరెట్టా (టోపీ) పెట్టి, చేతి వేలికి ఉంగరం తొడిగి పోప్ ఫ్రాన్సిస్ ఆయనను అభిషిక్తుడిని చేశారు. ఆ తర్వాత పూల ఆంటోనిని కౌగిలించుకున్న పోప్.. కాసేపు ముచ్చటించారు. పూల ఆంటోనితో పాటు గోవా ఆర్చ్ బిషప్ ఫిలిప్ నేరి ఫెర్రావ్‌ను కూడా కార్డినల్‌గా అభిషేకించారు. వీరిద్దరినీ శనివారం అభిషేకించడంతో ఇండియాలో మొత్తం కార్డినల్స్ సంఖ్య ఆరుకు చేరింది.

కార్డినల్ హోదా పొందిన తొలి దళితుడిగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని తొలి వ్యక్తిగా డాక్టర్ పూల ఆంటోని చరిత్ర సృష్టించారు. శనివారం వాటికన్ సిటీలో మొత్తం 20 మంది కార్డినల్స్‌ను పోప్ అభిషేకం చేశారు. గతంలో కార్డినల్ హోదా ఎక్కువ మందికి ఇచ్చేవారు కాదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియానిటీ.. ముఖ్యంగా క్యాథలిక్కుల సంఖ్య తగ్గిపోతున్నదనే ఆందోళన ఎక్కువయ్యింది. దీంతో కార్డినల్స్‌ను పెంచి.. తద్వారా మరింతగా రోమన్ క్యాథలిక్ మిషన్ (ఆర్సీఎం) సేవలను విస్తరించాలని నిర్ణయించారు.

కన్‌సిస్టరీ ముగిసిన తర్వాత పోప్ ఫ్రాన్సిస్ కొత్త కార్డినల్స్‌ను ఉద్దేశించి సందేశాన్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా క్యాథలిక్కుల సంఖ్య తగ్గిపోతుందని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఇకపై సాధారణ ప్రజలను చర్చికి దగ్గరగా చేయాలని.. ఉన్నత వర్గాల వారి కంటే సామాన్యులను దగ్గర తీయడం ద్వారా చర్చి మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. అలా చేయడం ద్వారా భూమ్మీద క్యాథలిక్కులు పూర్వ వైభవాన్ని పొందుతారని అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఆ పదవిని చేపట్టిన తర్వాత కొత్త కార్డినల్స్‌ను అభిషేకం చేయడం ఇది ఎనిమిదోసారి.

కొత్త కార్డినల్స్ వాటికన్ సిటీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆర్సీఎంకు అత్యున్నత సలహాదారులుగా, పాలకులుగా సేవలు అందిస్తారు. కార్డినల్స్‌లో 80 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్లు.. రాబోయే రోజుల్లో పోప్ పదవిని పొందడానికి అర్హత ఉండే 'కాంక్లేవ్'లో చోటు దక్కించుకుంటారు. ఈ క్రమంలో 60 ఏళ్ల పూల ఆంటోనికి కూడా కాంక్లేవ్‌లో చోటు దక్కుతుందని భావిస్తున్నారు.

డాక్టర్ పూల ఆంటోని ప్రస్తుతం హైదరాబాద్ ఆర్చ్ బిషప్‌గా ఉన్నారు. కార్డినల్ అయిన తర్వాత కూడా ఆయన ఆర్చ్ బిషప్‌గా కొనసాగనున్నారు. 2008లో ఆయన కర్నూల్ ఆర్చ్ బిషప్‌గా తొలి సారి నియమించబడ్డారు. 2020 నుంచి హైదరాబాద్ ఆర్చ్ బిషప్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది మేలో ఆయనను కార్డినల్‌గా నియమిస్తున్నట్లు పోప్ ప్రకటించి.. శనివారం అభిషేకం చేశారు.

First Published:  28 Aug 2022 6:34 AM GMT
Next Story