Telugu Global
National

అస్సోం లేడీ సింగాన్ని పోలీసులే కొట్టి చంపారా? వైరల్ అవుతున్న ఆధారాలు

ప్రమాదం జరిగిన సమయంలో కారు ఆగి ఉందని ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. ఆ కారు నుంచి ఇద్దరు వ్యక్తులు దిగిపోయిన కాసేపటికే వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఆగి ఉన్న కారును ఢీకొందని ప్రత్యక్ష సాక్షినని చెప్పుకుంటున్న వ్యక్తి వీడియో విడుదల చేశాడు.

అస్సోం లేడీ సింగాన్ని పోలీసులే కొట్టి చంపారా? వైరల్ అవుతున్న ఆధారాలు
X

అస్సోం రాష్ట్రానికి చెందిన మహిళా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ జున్ముణి రాభా లేడీ సింగంగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయారు. అయితే ఆమె మరణంపై అనుమానాలు తలెత్తాయి. పోలీసు సిబ్బంది వెంట లేకుండా అర్ధరాత్రి వేళ‌ ఒంట‌రిగా కారులో వెళ్లడం, కనీసం ఆమె ఎక్కడికి వెళ్ళేది ఇంట్లో వారికి కూడా తెలియకపోవడంతో ఆమె మరణంపై అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమవుతున్నాయి. జున్ముణి రాభాను తోటి పోలీసు అధికారులే చిత్ర హింసలు పెట్టి చంపారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జున్ముణి రాభాను పోలీసు శాఖలోని కొందరు ఉన్నతాధికారులు చిత్రహింసలు పెట్టి కొట్టి చంపారని ఓ మహిళా కానిస్టేబుల్ ఆడియో క్లిప్ విడుదల చేసింది. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో సీఐడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జున్ముణి రాభా ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొందని పోలీసులు తెలిపారు.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు ఆగి ఉందని ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. ఆ కారు నుంచి ఇద్దరు వ్యక్తులు దిగిపోయిన కాసేపటికే వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఆగి ఉన్న కారును ఢీకొందని ప్రత్యక్ష సాక్షినని చెప్పుకుంటున్న వ్యక్తి వీడియో విడుదల చేశాడు. ఈ ఆధారాల ప్రకారం పోలీసులే జున్ముణి రాభాను చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆరోపణలు వస్తున్నాయి.

రాభాను ఎక్కడో హత్య చేసి ఆమె మృతదేహాన్ని కారులో పెట్టి నడిరోడ్డులో ట్రక్కుతో ఢీ కొట్టి ప్రమాదంగా చిత్రీకరించారని పలువురు ఆరోపిస్తున్నారు. జున్ముణి రాభా నేరస్తుల పాలిట సింహ స్వప్నంలా నిలిచారు. వారి పట్ల కఠినంగా వ్యవహరించేవారు. అక్రమాలకు పాల్పడ్డ కాబోయే భర్తని కూడా అరెస్టు చేసి దేశవ్యాప్తంగా లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అదే కేసులో రాభా పాత్ర కూడా ఉందని ఆ తర్వాత ఆరోపణలు వచ్చాయి. ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ పట్టుపడ్డ జున్ముణి రాభా కొన్ని రోజులపాటు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత డ్యూటీలో చేరిన కొద్ది రోజులకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది పక్కాగా ప్లాన్ వేసి చేసిన హత్య అని రాభా తల్లి సుమిత్ర రాభా కూడా ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు.

First Published:  19 May 2023 7:30 AM GMT
Next Story