Telugu Global
National

డబుల్ ఇంజిన్ వైఫల్యాలు.. నీరసించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు

డబుల్ ఇంజిన్ కాస్తా ట్రబుల్ ఇంజిన్ గా మారి బీజేపీ పాలిత రాష్ట్రాలు నీరసపడుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ స్కూల్ పిల్లల డ్రాపవుట్స్ లెక్కలు. పాఠశాల విద్య విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు తిరోగమనంలో ఉన్నాయి.

డబుల్ ఇంజిన్ వైఫల్యాలు.. నీరసించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు
X

డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఆయా రాష్ట్రాల్లో రెట్టింపు అభివృద్ధి జరుగుతుందంటూ బీజేపీ గొప్పలు చెప్పుకుంటుంది. కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో కూడా తమకే అధికారం అప్పగిస్తే అద్భుతాలు సృష్టిస్తామంటుంది. మరి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏంటి..? అక్కడ అద్భుతాలు జరిగినప్పుడే, ఇతర రాష్ట్రాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తాయి. సింగిల్ ఇంజిన్ ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే, డబుల్ ఇంజిన్ కాస్తా ట్రబుల్ ఇంజిన్ గా మారి బీజేపీ పాలిత రాష్ట్రాలు నీరసపడుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ స్కూల్ పిల్లల డ్రాపవుట్స్ లెక్కలు. పాఠశాల విద్య విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు తిరోగమనంలో ఉన్నాయి.

సెకండరీ స్కూల్‌ స్థాయిలో చదువు మానేసిన పిల్లల వివరాలకోసం దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ రెండో స్థానంలో ఉంది. బీజేపీ పాలిత గుజరాత్‌ లో డ్రాపవుట్స్ ఎక్కువ, అంటే డబుల్ ఇంజిన్ మహిమ ఏంటో తేలిపోయినట్టే కదా. బడి మానేస్తున్న పిల్లలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్‌, గుజరాత్‌, అసోం, మేఘాలయ, కర్నాటక తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. ఇందులో మూడు రాష్ట్రాల్లో బీజేపీ సర్కారు ఉండటం విశేషం. కేంద్రం ప్రోత్సాహకాలిస్తున్నా, రాష్ట్రాల్లో బీజేపీ సర్కారు ఉన్నా కూడా అక్కడ ఫలితం లేదు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.

కొత్త జాతీయ విద్యా విధానంలో భాగంగా 2030 లోగా దేశంలో డ్రాపవుట్స్ లేకుండా చూడాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యానికి బీజేపీ పాలిత రాష్ట్రాలే పెద్ద అడ్డంకి. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్, సంకీర్ణం ఉన్న మహారాష్ట్రలో కూడా డ్రాపవుట్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది. యునిసెఫ్‌ లెక్కల ప్రకారం మనదేశంలో డ్రాపౌట్స్‌ లో 33 శాతం బాలికలే. ఇళ్లలో పని చేసేందుకు తల్లిదండ్రులే ఆడపిల్లలను చదువు మాన్పిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. బేటీ బచావో, బేటీ పఢావో వంటి కార్యక్రమాలు స్టేట్ మెంట్ల వరకే పనికొస్తున్నాయి కానీ వాస్తవ రూపం దాల్చడం లేదని తెలుస్తోంది.

First Published:  13 Jun 2023 1:39 AM GMT
Next Story