Telugu Global
National

'ఇండియా' కూటమికి షాక్ మీద షాక్

కాంగ్రెస్ పార్టీకి టీఎంసీ చేసిన ఏ ప్రతిపాదన కూడా నచ్చలేదని, అందువల్లే బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మమతా ప్రకటించారు.

ఇండియా కూటమికి షాక్ మీద షాక్
X

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ఏర్పడిన 'ఇండియా' కూటమికి ఎన్నికలకు ముందే బీటలు వారుతున్నాయి. వరుసగా ఆ కూటమికి కీలక నాయకులు దూరమవుతున్నారు. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండగా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ పై వరుసగా విమర్శలు చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడంపై అఖిలేష్ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు 'ఇండియా' కూటమిలోనే కీలక పార్టీలైన టీఎంసీ, ఆప్ పార్టీలు డబుల్ షాక్ ఇచ్చాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో తమకు ఎటువంటి సంబంధాలు లేవని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టంచేశారు.

'ఇండియా' కూటమిలో భాగంగా కాంగ్రెస్ తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమైనట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి టీఎంసీ చేసిన ఏ ప్రతిపాదన కూడా నచ్చలేదని, అందువల్లే బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మమతా ప్రకటించారు. కాంగ్రెస్ తో ఇకపై ఎలాంటి సంబంధాలు ఉండ‌వని ప్రకటించారు. బెంగాల్లో ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పారు. ఎన్నికల అనంతరం జాతీయస్థాయిలో పొత్తు విషయమై అప్పుడు నిర్ణయం తీసుకుంటామని మమతా తెలిపారు.

కాగా, కాంగ్రెస్ తో పొత్తు లేదని మమతా బెనర్జీ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కాంగ్రెస్ కు మరో షాక్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ సొంతంగా పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తు లేదని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని ఆప్ పంజాబ్ నాయకులు చేసిన ప్రతిపాదనకు ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆమోదం తెలపడంతోనే భగవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారం చేపట్టాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి టీఎంసీ, ఆప్ పార్టీలు డబుల్ షాక్ ఇచ్చాయి.

First Published:  24 Jan 2024 2:23 PM GMT
Next Story