Telugu Global
National

లుంగీలు, నైటీలు వేసుకుని తిరగొద్దు.. అపార్ట్‌మెంట్ నిర్వాహకుల వింత రూల్

అయితే అపార్ట్మెంట్ నిర్వాహకులు తీసుకువచ్చిన ఈ వింత నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అపార్ట్మెంట్ పరిధిలో తిరిగేటప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్వాహకులే నిర్ణయిస్తారా..?

లుంగీలు, నైటీలు వేసుకుని తిరగొద్దు.. అపార్ట్‌మెంట్ నిర్వాహకుల వింత రూల్
X

బయట ఏ పని చేస్తున్నా.. ఎంత ఉన్నత ఉద్యోగం చేస్తున్నా.. ఇంటికి వచ్చిన తర్వాత కాస్త ఫ్రీగా ఉండేందుకు మగవారు లుంగీలు, ఆడవాళ్లు నైటీలు ధరిస్తుంటారు. మగాళ్ళు అయితే బజార్ కు కూడా లుంగీతోనే వెళ్లి తమ పని చూసుకొస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఓ అపార్ట్‌మెంట్ నిర్వాహకులు తీసుకువచ్చిన వింత నిబంధన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న వారు బయటకు వచ్చే సమయంలో లుంగీలు, నైటీలూ ధరించవద్దని రూల్ తీసుకురావడంతో అంతా విస్తుపోతున్నారు.

గ్రేటర్ నోయిడా సెక్టార్ -2లో హిమ్ సాగర్ అనే అపార్ట్‌మెంట్ ఉంది. ఈ అపార్ట్‌మెంట్లోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జూన్ 10వ తేదీన ఒక సర్క్యులర్ జారీ చేసింది. అందులో.. `అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న వారు అపార్ట్మెంట్ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో తిరిగే సమయంలో లుంగీలు, నైటీలు ధ‌రించి తిరగవద్దు. అపార్ట్మెంట్ వాసులు తాము ధరించే దుస్తులు, ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలా శ్రద్ధ పెట్టినప్పుడే మీ ప్రవర్తనను ఎవరూ తప్పుపట్టే అవకాశం ఉండదు' అని ఆ సర్క్యులర్ లో సూచించారు.

అయితే అపార్ట్మెంట్ నిర్వాహకులు తీసుకువచ్చిన ఈ వింత నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అపార్ట్మెంట్ పరిధిలో తిరిగేటప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్వాహకులే నిర్ణయిస్తారా..? అని కొందరు ప్రశ్నిస్తుండగా.. మరి కొందరు మాత్రం నిర్వాహకులు తీసుకువచ్చిన రూల్ కు మద్దతు తెలుపుతున్నారు.

దీనిపై అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సీకే కల్రా మాట్లాడుతూ.. అపార్ట్మెంట్లో తాము ఎవరి పట్ల వివక్ష చూపడం లేదని చెప్పారు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న కొందరు వదులుగా ఉండే దుస్తులు ధరించి బయట తిరుగుతున్నారని, అలాగే యోగా చేస్తున్నారని తెలిపారు. దీనిపై అపార్ట్మెంట్లోని కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఇటువంటి నిబంధనను తీసుకువచ్చినట్లు వెల్లడించారు. లుంగీలు, నైటీలు ధరించి బయట తిరగవద్దని.. అలా తిరుగుతున్న కొందరికి నేరుగా చెప్పడం జరిగిందని.. అయినా వారిలో మార్పు రాకపోవడంతో దుస్తుల విషయంలో నిబంధన విధించి సర్క్యులర్ జారీ చేసినట్లు ఆయన చెప్పారు.

First Published:  14 Jun 2023 2:21 PM GMT
Next Story