Telugu Global
National

ప్రధాని మోడీని తిట్టకండి.. కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థులకు అధిష్టానం ఆదేశం

ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులకు కొన్ని నిబంధనలు పెట్టింది. ప్రచారాల్లో, ర్యాలీల్లో, వ్యక్తిగతంగా ప్రధాని మోడీని, హిందుత్వను విమర్శిస్తూ మాట్లాడవద్దని ఆదేశించింది.

ప్రధాని మోడీని తిట్టకండి.. కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థులకు అధిష్టానం ఆదేశం
X

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనపడుతోంది. జోడో యాత్ర తర్వాత పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా యాత్ర చేపట్టారు. ఇది పార్టీకి బాగానే కలసి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా శివకుమార్ నేతృత్వంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నారు.

కాగా, ఈ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులకు కొన్ని నిబంధనలు పెట్టింది. ప్రచారాల్లో, ర్యాలీల్లో, వ్యక్తిగతంగా ప్రధాని మోడీని, హిందుత్వను విమర్శిస్తూ మాట్లాడవద్దని ఆదేశించింది. కేవలం కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన, మోడీ పాలనలో ప్రజల స్థితిగతులు, కర్ణాటక ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రంలో బీజేపీ పాలనలో అమలు చేయబడిన 40 శాతం లంచాలు, ధరల పెరుగుదల వంటి విషయాలపై మాత్రమే హైలైట్ చేయాలని ఆదేశించింది.

కర్ణాటక ఎన్నికలకు సంబంధించి మొదటి లిస్టులో 124 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధి రామయ్య, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రన్‌దీప్ సూర్జేవాలాతో పాటు 124 అభ్యర్థులకు హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది. మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, హిందుత్వను విమర్శించడం వల్ల కాంగ్రెస్‌కు పెద్ద మైనస్ అవుతోంది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల హిందువుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడటం లేదు అని హైకమాండ్ అంచనా వేస్తోంది. అందుకే ప్రజా సమస్యలనే పెద్దగా హైలైట్ చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిని కూడా ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

కర్ణాటక లోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు కేటాయించిన 4 శాతం (ఓబీసీ) రిజర్వేషన్లను రద్దు చేసింది. దీనిపై కూడా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా విమర్శించలేదు. ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తూ ఎక్కువగా మాట్లాడటం వల్ల అసలుకే మోసం వస్తుందని అంచనా వేస్తోంది. అందుకే చాలా జాగ్రత్తగా ర్యాలీలు, బహిరంగ సభల్లో మాట్లాడాలని సూచించింది. కాంగ్రెస్ పార్టీకి ఈ సారి అనుకూలమైన పవనాలు వీస్తున్నాయని, కాబట్టి అనవసరమైన వ్యాఖ్యలు చేసి దాన్ని పార్టీకి వ్యతిరేకంగా మార్చవద్దని హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది.

First Published:  5 April 2023 12:10 PM GMT
Next Story