Telugu Global
National

డోలో 650 ప్రిస్క్రైబ్ చేయడానికి డాక్టర్లకు 1000 కోట్ల లంచాలు!

డోలో 650 అమ్మకాలు పెంచుకోవడానికి ఆ కంపెనీ డాక్టర్లకు 1000 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నివేదిక ఇచ్చింది. ఈ విషయాన్ని మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

డోలో 650 ప్రిస్క్రైబ్ చేయడానికి డాక్టర్లకు 1000 కోట్ల లంచాలు!
X

డోలో 650 ట్యాబ్లెట్లను ప్రిస్క్రైబ్ చేయడం కోసం తయారీ దారులు డాక్టర్లకు 1000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నివేదిక ఇచ్చినట్టు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

రోగులకు డ్రగ్స్ సిఫార్సు చేయించడం కోసం ఫార్మా కంపెనీలు వైద్యులకు ఎలాంటి ఉచితాలు అందించకుండా నిరోధించాలంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణ ఈ రోజు జరిగింది.

పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సంజయ్‌ పారిఖ్, కోవిడ్ 19 కాలంలో డోలో 650 అమ్మకాల కోసం తయారీదారు అనైతిక పద్దతులను అనుసరించారని ఆరోపించారు. ఈ డోలో కంపెనీ డాక్టర్లకు వేయి కోట్ల రూపాయల లంచాలను ముట్టజెప్పిందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తని నివేదికలో పొందుపర్చిందని చెప్పారు.

కాగా ఈకేసును విచారిస్తున్న ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ డివై చంద్రచూడ్ డోలో కంపెనీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ కెఎమ్ నటరాజ్ ను ఉద్దేశించి ''మీరు చెప్పేదేదీ నాకు నచ్చడం లేదు. నాకు కరోనా సోకిన సమయంలో కూడా సరిగ్గా ఇదే వాడాలని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన సమస్య'' అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై వారం రోజుల్లో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం 10 రోజుల తర్వాత ఈ అంశాన్ని మళ్లీ విచారిస్తామని తెలిపారు.

మరో వైపు, అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ఒప్పందంలో భారత దేశం సంతకం చేసినప్పటికీ

ఇక్కడ ఫార్మా రంగంలో అవినీతి నియంత్రణ జరగడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఫార్మా మార్కెటింగ్ రంగంలో లంచాలివ్వడాన్ని భారతదేశంలోని ఏ చట్టమూ నిషేధించలేదన్నారు.

లంచాలు తీసుకొని డాక్టర్లు రాసే ఇలాంటి మందులు రోగి ప్రాణాలకు, ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

First Published:  18 Aug 2022 3:52 PM GMT
Next Story