Telugu Global
National

కస్టడీలో కుక్క.. పోలీసులకు చుక్కలు

రోజువారీ ఆ కుక్కకు ఆహారం పెట్టలేక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్‌లోని సిబ్బందే ప్రతీ రోజు చందాలు వేసుకొని ఆహారం పెడుతున్నారు.

కస్టడీలో కుక్క.. పోలీసులకు చుక్కలు
X

ఒక్కోసారి పోలీసుల అత్యుత్సాహం వారికే ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటుంది. కరుడు కట్టిన నేరస్తులను, దొంగలను, స్మగ్లర్లను పట్టుకున్నామనే సంతోషంలో వారు చేసే చిన్న తప్పులే తర్వాత తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. ఇప్పుడు బీహార్ పోలీసులు ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నారు. జూలై 6న బీహార్‌లోని బక్సర్ జిల్లా ఘాజీపూర్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ కారులో భారీగా విదేశీ మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఇద్దరు వ్యక్తులతో పాటు కారులో ఉన్న జర్మన్ షెపర్డ్ కుక్కను ముఫసిల్ స్టేషన్‌కు తరలించారు.

కాగా, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన తర్వాత బీహార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసే సమయంలో కుక్కను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అసలు అప్పుడు ఏ సోయిలో ఉండి అలా ఎఫ్ఐఆర్ రాశారో తెలియదు. కానీ, ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిగా మారింది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడమే కాకుండా, అక్రమంగా విదేశీ మద్యం కలిగి ఉండటంతో సతీశ్ కుమార్, భువనేశ్వర్ యాదవ్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వారిని కోర్టుకు తరలించగా.. కోర్టు రిమాండ్ విధించి సెంట్రల్ జైలుకు పంపించింది. కారులో దొరికిన లిక్కర్‌తో పాటు వాహనాన్ని సీజ్ చేశారు.

కుక్కను పోలీసులు స్టేషన్‌లోనే కస్టడీలో ఉంచారు. కానీ ఆ కుక్క పోలీసులకే చుక్కలు చూపిస్తోంది. ఖరీదైన విదేశీ బ్రీడ్‌కు చెందిన ఈ కుక్కను పోషించడం పోలీసుల వల్ల కావడం లేదు. రోజువారీ ఆ కుక్కకు ఆహారం పెట్టలేక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్‌లోని సిబ్బందే ప్రతీ రోజు చందాలు వేసుకొని ఆహారం పెడుతున్నారు. ఏదో సాదా సీదా ఆహారం పెట్టడానికి ట్రై చేస్తే ఆ కుక్క భీకరంగా మొరుగుతూ.. స్టేషన్‌ను అల్లాడిస్తోంది. దీంతో చేసేదేమీ లేక ఖరీదైన పెడిగ్రీ కొని పెడుతున్నారు. గత 11 రోజులుగా కుక్క ఇలా సతాయిస్తుండటంతో ఆ కుక్కను తీసుకెళ్లాలని పోలీసులు యజమానులకు కబురు పెట్టారు.

కాగా, కుక్క యజమానులు మాత్రం స్టేషన్‌కు రావడం లేదు. అనవసరంగా ఆ కుక్కపై కేసు పెట్టడం ఏంటని యజమానులు అంటున్నారు. మరోవైపు ఈ కుక్కను పోషించడం తమ వల్ల కావడం లేదని, పైగా ఆ కుక్క ఇంగ్లీష్‌లో చెప్తేనే అర్థం చేసుకుంటోందని పోలీసులు వాపోతున్నారు. కుక్క పోషణతో పాటు.. దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఒక పెట్ ట్రైనర్‌ను కూడా పెట్టడం గమనార్హం.

First Published:  18 July 2022 6:14 AM GMT
Next Story