Telugu Global
National

డాక్టర్ స్పర్శ మిస్ బిహేవ్ ఎలా అవుతుంది..? – కేరళ హైకోర్టు

డాక్టర్ స్పర్శ మిస్ బిహేవ్ ఎలా అవుతుంది..? – కేరళ హైకోర్టు
X

వైద్యంకోసం వచ్చే రోగులకు స్టెతస్కోప్ ని గుండెలపై పెట్టి గట్టిగా ఊపిరి తీసుకోండి అని డాక్టర్లు చెబుతుంటారు. అలా చెప్పడం మిస్ బిహేవ్ అవుతుందా..? చేయి పట్టుకుని నాడి చూసిన మగ డాక్టర్ ని, ఆడ పేషెంట్ చెంప పగలగొడితే ఊరుకోవాలా..? ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది కేరళ హైకోర్టు. ఇలాంటి వాటిని మిస్ బిహేవింగ్ అనలేమని తేల్చి చెప్పింది. డాక్టర్లు తమ వృత్తిలో భాగంగానే రోగులను ముట్టుకుంటారని, దానికి విపరీతార్థాలు తీయొద్దని చెప్పింది. పేషెంట్లను ముట్టుకోకుండా డాక్టర్లు వైద్యం చేయలేరని స్పష్టం చేసింది.

వెరైటీ కేసు..

కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇటీవల జరిగిన సంఘటనపై పోలీస్ కేసు నమోదైంది. డాక్టర్ తన భార్యతో మిస్ బిహేవ్ చేశాడంటూ ఓ వ్యక్తి ఆ డాక్టర్ ని చితకబాదాడు. డాక్టర్ ఫిర్యాదుతో పోలీస్ కేసు నమోదైంది. సదరు వ్యక్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. డాక్టర్ల స్పర్శను మిస్ బిహేవ్ అనడం సరికాదని చెప్పింది.

అసలేం జరిగింది..?

డాక్టర్లు ఉద్దేశపూర్వకంగా మహిళా పేషెంట్లతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పింది హైకోర్టు. అయితే అదే సమయంలో ప్రతి స్పర్శను తప్పుడు దృష్టితో చూడొద్దని చెప్పింది. కేరళ కేసులో.. డాక్టర్ సదరు మహిళా పేషెంట్ ని ఆమె ఇద్దరు అక్కల సమక్షంలోనే పరీక్షించారు. అది కూడా ఓపెన్ ఏరియాలో ఉన్న ఔట్ పేషెంట్ విభాగంలోనే పరీక్ష చేశారు. ఆ వెంటనే దూరంగా కూర్చుని ఉన్న ఆమె భర్త ఒక్కసారిగా దూసుకొచ్చాడు. డాక్టర్ పై చేయి చేసుకున్నాడు. తన భార్య చేతిని ఎందుకు పట్టుకున్నావంటూ నిలదీశాడు. దీంతో డాక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా, బెయిల్ పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

First Published:  1 March 2023 5:37 AM GMT
Next Story