Telugu Global
National

మోడీ హయాంలో తాజా అప్పు ఎంతో తెలుసా?

తాజాగా ఆర్ధికశాఖ ప్రకటన ప్రకారమే కేంద్రం అప్పు రూ.147 లక్షల కోట్లు. గడచిన ఎనిమిదన్నరేళ్ళల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం చేసిన అప్పే సుమారు 70 లక్షల కోట్ల రూపాయలుందట.

Narendra Modi
X

మోడీ హయాంలో తాజా అప్పు ఎంతో తెలుసా?

బీజేపీ నేతల వ్యవహారమంతా గురివింద గింజ నీతిలాగ తయారైపోయింది. ఏపీ, తెలంగాణల్లో పర్యటించిన కేంద్రమంత్రులు లేదా పార్టీ నేతలు, స్ధానిక నేతలు ప్రతిరోజు అప్పుల గురించి నానా గోల చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌ పాలనలో రాష్ట్రాలు నానాటికీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, రాష్ట్రాలు శ్రీలంకలాగ తయారైపోతున్నాయంటు రచ్చరచ్చ చేస్తున్నారు. ఏపీ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు కన్వీనియంట్‌గా మరచిపోయేదేమంటే ప్రస్తుత రాష్ట్రం అప్పుల్లో చంద్రబాబునాయుడు పాలనలో చేసిన అప్పుకూడా కలిసుందని. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల అప్పులు తెలుగు రాష్ట్రాల కన్నా ఇంకా ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయున్నాయి. మళ్ళీ వాటి గురించి అడిగితే నోరెత్తరు.

సరే కాసేపు ఏపీ అప్పు గురించి వదిలేసి కేంద్రం అప్పు ఎంతో చూద్దాం. తాజాగా ఆర్ధికశాఖ ప్రకటన ప్రకారమే కేంద్రం అప్పు రూ.147 లక్షల కోట్లు. గడచిన ఎనిమిదన్నరేళ్ళల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం చేసిన అప్పే సుమారు 70 లక్షల కోట్ల రూపాయలుందట. అంటే 2014కి ముందున్న ప్రభుత్వాలన్నీ కలిసి 62 ఏళ్ళల్లో 77 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే మోడీ ప్రభుత్వం మాత్రమే రూ.70 లక్షల కోట్ల అప్పు చేసింది. మోడీ ప్రభుత్వం అసలిన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేసింది?

ఒక్క పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏర్పాటు చేయలేదు. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయకపోగా ఉచితాలు వద్దంటు మోడీ గోల చేస్తున్నారు. కరోనా వైరస్ కాలంలో ఏమన్నా జనాలకు సాయం చేశారా అంటే అదీలేదు. అప్పట్లో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవరికీ తెలీదు. చిన్నతరహా పరిశ్రమలకు సాయం చేస్తున్నారా అంటే అదీ కనబడటం లేదు. పీఎం కేర్స్ పేరుతో విరాళాల రూపంలో కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చాయి. అవేం చేశారో ఎవరికీ తెలీదు.

ఇదే సమయంలో ఏవో కారణాలు చెప్పి పబ్లిక్ సెక్టార్లలో కొన్నింటిని రూ. 4 లక్షల కోట్లకు అమ్మేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు బ్యాంకుల అప్పుల రూపంలో వేల కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు. మరోవైపు పారిశ్రామికవేత్తలు చెల్లించాల్సిన రూ. 12 లక్షల కోట్లను ప్రభుత్వమే రానిబాకీల కింద రద్దు చేసింది. మరి చేయాల్సిన నష్టం చేస్తూ కూడా మళ్ళీ రూ. 70 లక్షల కోట్లు అదనంగా ఎందుకు అప్పు చేసిందో అర్ధం కావటం లేదు. ఇంతోటిదానికి మళ్ళీ రాష్ట్రాల అప్పులపై మోడీ ఆందోళన చేస్తుండటమే విచిత్రంగా ఉంది.

First Published:  28 Dec 2022 6:19 AM GMT
Next Story