Telugu Global
National

ఒక్క ఖైదీపై ప్రభుత్వం రోజుకు ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా..?

ఈ ఐదేళ్లలో కొత్తగా జైళ్లకు వెళ్లిన ఖైదీల సంఖ్య కూడా 23 శాతం పెరిగింది. ఐదేళ్లలో 5 లక్షల 73 వేల మంది జైలు పాలయ్యారు. కానీ, అందుకు తగ్గ ఏర్పాట్లు మాత్రం చేయలేకపోతున్నారు జైలు శాఖ‌ అధికారులు.

ఒక్క ఖైదీపై ప్రభుత్వం రోజుకు ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా..?
X

భారత్‌లోని జైళ్లన్నీ పరిమితికి మించిన ఖైదీలతో నిండిపోతున్నాయి. ఏటా ఖైదీల సంఖ్య పెరుగుతూ పోతున్నా, వారికి కావాల్సిన సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఈ ఐదేళ్లలో పరిస్థితి మరింత దిగజారిపోయింది. కొన్ని జైళ్లలో ఉండగలిగే దానికంటే రెట్టింపు సంఖ్యలో ఖైదీలున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం గడిచిన ఐదేళ్లలో ఖైదీల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఖైదీల మీద ప్రభుత్వం చేసే ఖర్చు కూడా 42 శాతం పెరిగింది.

2018-19లో భారత దేశంలోని ఖైదీలపై రూ. 1,776 కోట్లు ఖర్చు చేయగా.. 2022-23 నాటికి అది రూ. 2,528 కోట్లకు పెరిగింది. ఇక 2018లో జైళ్లల్లో 117.6 శాతంగా ఉన్న ఖైదీల సంఖ్య‌ 2022 వచ్చే సరికి ఏకంగా 131.4 శాతానికి పెరిగింది. అంటే వంద మంది ఉండాల్సిన చోట 131 మందిని ఉంచుతున్నారు. జిల్లాల్లో ఉండే జైళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఐదేళ్ల కిందట 133 శాతంగా ఉన్న ఖైదీల సాంద్రత 2022 నాటికి 156.5కు పెరిగింది. జైళ్లల్లో పరిమితికి మంచిన ఖైదీలను ఉంచుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. యూపీలో 2018లో 183 శాతంగా ఉన్న ఖైదీల సాంద్రత 2022 వచ్చే సరికి 207.6 శాతానికి పెరిగింది. అంటే వందమందిని ఉంచే దగ్గర 200 మంది ఖైదీలను ఉంచుతున్న దుస్థితి. యూపీ తర్వాతి స్థానాల్లో ఉత్తరాఖండ్‌ 182.4శాతం, పశ్చిమ బెంగాల్‌ 181శాతం, మేఘాలయా 167.2శాతం, మధ్యప్రదేశ్‌ 163శాతం, జమ్మూకశ్మీర్‌ 159శాతంగా ఖైదీల సాంద్రత ఉంది.

ఈ ఐదేళ్లలో కొత్తగా జైళ్లకు వెళ్లిన ఖైదీల సంఖ్య కూడా 23 శాతం పెరిగింది. ఐదేళ్లలో 5 లక్షల 73 వేల మంది జైలు పాలయ్యారు. కానీ, అందుకు తగ్గ ఏర్పాట్లు మాత్రం చేయలేకపోతున్నారు జైలు శాఖ‌ అధికారులు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో ఒక్క జైలు నిర్మాణం కూడా జరగలేదు కదా 1339 నుంచి 1330కి జైళ్ల సంఖ్య పడిపోయింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రతి 10 మందిలో 8 మంది ఖైదీలు అండర్ ట్రయల్‌లో ఉన్నవారే. అంటే వీళ్లు దోషులని ఇంకా రుజువు కాలేదు. కోర్టు పరిధిలో కేసు ఉండటంతో జైల్లో మగ్గుతున్నవారే ఎక్కువ మంది ఉన్నారు.

2022లో ఖైదీలపై భారత ప్రభుత్వం 2,528 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇందులో రూ.1,916 కోట్లు అండర్ ట్రయల్‌లో ఉన్న ఖైదీలపైనే ఖర్చు చేసింది. అలాగే ఒక్క ఖైదీపై ఖర్చుపెట్టే సొమ్ము కూడా పెరిగింది. 2018లో ఏడాదికి ఒక్క ఖైదీపై 38 వేలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం.. 2022లో 44,129 రూపాయలు ఖర్చు చేసింది. 12 రాష్ట్రాలు మాత్రం జాతీయ సగటు కంటే ఖైదీలపై ఎక్కువ బడ్జెట్‌ ఖర్చు పెడుతున్నాయి. ఇందులో మొదటిస్థానంలో ఏపీ ఉంది. ఏపీ జైళ్ల శాఖ ఏడాదిలో అత్యధికంగా ఒక్క ఖైదీపై 2లక్షల 68వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఆ తర్వాత హర్యానా లక్షా 60వేలు, ఢిల్లీ లక్షా 49వేలు ఖర్చు పెడుతున్నాయి. అత్యల్పంగా మిజోరం ఏడాదిలో ఒక్క ఖైదీపై కేవలం 2వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తోంది. భారత ప్రభుత్వం ఒక్క ఖైదీపై రోజుకు 120రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ, ఇది చాలా తక్కువ. ఒక మనిషిపై రోజుకు 176 రూపాయలు ఖర్చు చేయాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన కనీస పోషకాలు అందుతాయి. కానీ అలా జరగడం లేదు.

First Published:  17 Dec 2023 9:01 AM GMT
Next Story