Telugu Global
National

టీ తాగనన్న కలెక్టర్‌కు మద్యం ఆఫర్ చేసిన మంత్రి.. విపక్షాల ఫైర్

సరదాగా ఏర్పాటు చేసుకున్న పార్టీలో ఇటువంటి వ్యాఖ్యలు చేసినా పర్లేదు కానీ.. పంట నష్టం పరిశీలనకు వెళ్లి ఇటువంటి పనులు చేయడం ఏంటని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

టీ తాగనన్న కలెక్టర్‌కు మద్యం ఆఫర్ చేసిన మంత్రి.. విపక్షాల ఫైర్
X

మహారాష్ట్రలో ఓ జిల్లా కలెక్టర్ టీ తాగడానికి నిరాకరించగా.. అయితే మద్యం తాగు..అంటూ మంత్రి వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సరదాగా ఏర్పాటు చేసుకున్న పార్టీలో ఇటువంటి వ్యాఖ్యలు చేసినా పర్లేదు కానీ.. పంట నష్టం పరిశీలనకు వెళ్లి ఇటువంటి పనులు చేయడం ఏంటని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పంట నష్టం అంచనా వేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ బీడ్ జిల్లాలో పర్యటించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ రాధాబినోద్ శర్మ, మరి కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు. ముందుగా వారు జిల్లాలోని గెవ్రాయి తాలూకాలో పంట నష్టాన్ని అంచనా వేశారు.

ఆ తర్వాత వారు ఒక హాల్లో కూర్చుని పంట నష్టంపై మాట్లాడుకుంటున్నారు. అంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి మంత్రితోపాటు అధికారులకు టీ అందజేశాడు. ఆ సమయంలో కలెక్టర్ రాధా బినోద్ శర్మ టీ తాగడానికి నిరాకరించారు. అప్పుడు మంత్రి అబ్దుల్ సత్తార్ కలెక్టర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'మద్యం తాగుతారా?' అని ప్రశ్నించారు.

కాగా, దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శి సచిన్ సావంత్ కూడా మంత్రి సత్తార్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి తీరుపై విమర్శలు చేశారు. మీరు చేపట్టింది పంట నష్టం అందించే యాత్రనా? లేకపోతే మద్యం తాగే యాత్రనా? అంటూ ప్రశ్నించారు.

First Published:  28 Oct 2022 7:22 AM GMT
Next Story