Telugu Global
National

ఎయిర్‌పోర్టులు, చుట్టుపక్కల ప్రదేశాల్లో 5జీ సర్వీసులపై తాత్కాలిక నిషేధం

5జీ సర్వీసులు అందించే బ్యాండ్ ఫ్రీక్వెన్సీ కారణంగా విమానాల రాడార్ ఆల్టిమీటర్‌లో అంతరాయం ఏర్పడుతున్నట్లు గుర్తించారు.

ఎయిర్‌పోర్టులు, చుట్టుపక్కల ప్రదేశాల్లో 5జీ సర్వీసులపై తాత్కాలిక నిషేధం
X

ఎయిర్‌పోర్టుల్లో 5జీ సేవలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యునికేషన్స్ (డాట్)కీలక నిర్ణయం తీసుకున్నది. 5జీ సర్వీసుల కోసం ఉపయోగించే బ్యాండ్ వల్ల విమానాల్లో ఉండే పరికరాలకు అంతరాయం ఏర్పడుతుందని డీజీసీఏ ఇటీవల డాట్‌కు లేఖ రాసింది. కొన్నాళ్లు 5జీ సర్వీసులను విమానాశ్రయాల పరిధి నుంచి తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నది. డీజీసీఏ ప్రతిపాదన మేరకు డాట్ తాజాగా టెలికాం కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో 5జీ సర్వీసులు అందిస్తున్న వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌ల ఎయిర్‌పోర్టుల్లో తాత్కాలిక నిషేధాన్ని ఎదుర్కోనున్నాయి.

ఎయిర్‌పోర్ట్ రన్‌వే రెండు ఎండ్స్‌ నుంచి 2.1 కిలోమీటర్లు.. రన్‌వే ఇరు వైపులా 910 మీటర్ల లోపు 5జీ సర్వీసులపై నిషేధం విధించారు. ఈ ప్రదేశాల్లో 5జీ, సీ-బ్యాండ్ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయవద్దని డాట్ ఆదేశించింది. ముఖ్యంగా 3,300 మెగాహెడ్జ్ నుంచి 3,670 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ ఉండే స్టేషన్లను ఎయిర్ పోర్టుల దగ్గర అసలు నిర్మించవద్దని కోరింది. కేవలం బేస్ స్టేషన్లు మాత్రమే కాకుండా రిపీటర్లు కూడా ఎయిర్‌పోర్టులకు 540 మీటర్ల లోపు ఏర్పాటు చేయవద్దని డాట్ టెలికాం సంస్థలను ఆదేశించింది.

5జీ సర్వీసులు అందించే బ్యాండ్ ఫ్రీక్వెన్సీ కారణంగా విమానాల రాడార్ ఆల్టిమీటర్‌లో అంతరాయం ఏర్పడుతున్నట్లు గుర్తించారు. దీని వల్ల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లోనే కాకుండా పర్వత శ్రేణులు ఉన్న ప్రాంతాల్లో విమానాలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న విమానాల రాడార్ టెక్నాలజీని మొత్తం మార్చే వరకు ఈ నిషేధం అమలులో ఉండనున్నది.

ప్రస్తుతం నాగ్‌పూర్, బెంగళూరు, న్యూ ఢిల్లీ, గౌహతి, పూణే ఎయిర్‌పోర్టుల్లో ఎయిర్‌టెల్ 5జీ బేస్ స్టేషన్లు, ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో జియో బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీటన్నింటినీ తొలగించాల్సి ఉంటుంది. బఫర్ జోన్‌లో ఎలాంటి సర్వీసులు అందించినట్లు తేలినా.. కఠిన చర్యలు ఉంటాయని డీజీసీఐ పేర్కొన్నది.

First Published:  1 Dec 2022 2:36 PM GMT
Next Story