Telugu Global
National

ప‌నికిమాలిన కేసులు వేయొద్దు.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి హైకోర్టు మొట్టికాయ‌లు !

ర‌హ్మ‌తుల్లా అనే ఏఎస్ఐ అక్ర‌మాస్తులు కలిగి ఉన్నాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు. అయితే అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలులేవ‌ని క‌ర్ణాట‌క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కేసు కొట్టేసింది. దీనిని స‌వాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

ప‌నికిమాలిన కేసులు వేయొద్దు.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి హైకోర్టు మొట్టికాయ‌లు !
X

క‌ర్ణాట‌క‌లోని బిజెపి ప్ర‌భుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మొట్టికాయ‌లు వేసింది. ప‌నికిమాలిన కేసులు వేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

కర్ణాటక స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నిర్దోషిగా విడుదల చేసిన ఓ రిటైర్డ్ ఏఎస్ఐ (అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌) కి వ్యతిరేకంగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచార‌ణ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం ఈ వ్యాఖ్య‌లు చేసింది. ఇటువంటి పనికిమాలిన కేసులు పెట్టడంపై రాష్ట్రానికి ఇదే లాస్ట్ వార్నింగ్ అని కోర్టు హెచ్చ‌రించింది. అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ త‌మ సందేశాన్ని ప్ర‌భుత్వానికి తెలియ‌జేస్తార‌నే విష‌యంలో న‌మ్మ‌కం లేన‌ప్ప‌టికీ ఆయ‌న కార్యాల‌యంపై గౌర‌వంతో ప్ర‌స్తుతానికి ప్రభుత్వంపై రూ.10 ల‌క్ష‌ల‌ జ‌రిమానా విధించ‌కుండా ఆగిపోతున్నాం. భ‌విష్య‌తులో ఇటువంటి కేసులు వేస్తే త‌ప్ప‌క చ‌ర్య‌లు ఉంటాయ‌ని కోర్టు పేర్కొంది.

భవిష్యత్తులో, ఇటువంటి పనికిమాలిన వ్యాజ్యాలను కోర్టు ముందుకు తెస్తే జరిమానా విధించ‌డ‌మే కాకుండా, సంబంధిత అధికారులపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంద‌ని జస్టిస్ జి. నరేందర్, జ‌స్టిస్ పిఎన్ దేశాయ్ ల ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం పేర్కొంది.

ర‌హ్మ‌తుల్లా అనే ఏఎస్ఐ అక్ర‌మాస్తులు కలిగి ఉన్నాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు. అయితే అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలులేవ‌ని క‌ర్ణాట‌క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కేసు కొట్టేసింది. దీనిని స‌వాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులో, "ప్రతివాది ఎదుర్కొంటున్నది ప్రాసిక్యూషన్ కాదని స్పష్టంగా ఉంది" అని హైకోర్టు పేర్కొంది.

ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టినందుకు రూ.10 లక్షల జరిమానా ఎందుకు విధించకూడదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ విష‌య‌మై ఈ రోజు జ‌రిగిన విచార‌ణ‌లో హైకోర్టు ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతూ ఇటివంటి కేసులు వేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించింది.

First Published:  30 Nov 2022 10:35 AM GMT
Next Story