Telugu Global
National

హత్యలు చేయండి, బెయిల్ ఇప్పిస్తా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

గోవధకు పాల్పడినవారిని ఇప్పటివరకు ఐదుగురిని చంపేశామంటూ గొప్పగా చెప్పుకున్నారు అహూజా. లాలావండి, బెహ్రార్‌ మూక హత్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ హత్యలు జరిగిన సమయంలో అహూజా ఎమ్మెల్యేగా ఉన్నారు.

హత్యలు చేయండి, బెయిల్ ఇప్పిస్తా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
X

'చంపేందుకు కార్యకర్తలకు నేను స్వేచ్ఛ ఇచ్చా. మేం వారిని బెయిల్‌ పై బయటకు తీసుకొస్తాం' గోవధకు పాల్పడితే ఎవరినైనా చంపేయాలంటూ రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత జ్ఞాన్ దేవ్ అహూజా ఇలా పిలుపునిచ్చారు. ఇలాంటి దారుణమైన స్టేట్ మెంట్లను సోషల్ మీడియా వెంటనే కట్టడి చేయాలి. కానీ ఈ స్టేట్ మెంట్ మోదీ కాళ్లకు మొక్కే ఫేస్ బుక్ ద్వారా వైరల్ గా మారింది. ఆ తర్వాత సంచలనం అయింది. చివరకు చేసేదేం లేక రాజస్థాన్ పోలీసులు అహూజాపై కేసు సెక్షన్‌ 153-ఎ కింద కేసు నమోదు చేశారు. బీజేపీ నేతల బరితెగింపున‌కు, రాక్షస ధోరణికి ఇంతకంటే నిదర్శనం కావాలా అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

గోవధకు పాల్పడినవారిని ఇప్పటివరకు ఐదుగురిని చంపేశామంటూ గొప్పగా చెప్పుకున్నారు అహూజా. లాలావండి, బెహ్రార్‌ మూక హత్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ హత్యలు జరిగిన సమయంలో అహూజా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే మిగతా మూడు హత్యల విషయం మాత్రం ఆయన ప్రస్తావించలేదు. అన్యాయం జరిగితే పోరాడండి, మీకు అండగా ఉంటామంటూ రాజకీయ నాయకులు కార్యకర్తల్ని రెచ్చగొట్టడం సహజమే. కానీ ఇక్కడ నేరుగా హత్యలు చేయండి, మీకు బెయిల్ ఇప్పిస్తామంటూ ఓ మాజీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చెప్పడం మాత్రం మరీ దారుణం. ఇలాంటివి భారత్, అందులోనూ బీజేపీ వ‌ల్లే జరుగుతాయనే విమర్శలు ఎక్కువయ్యాయి.

నుపుర్ లాగే చేతులు కడిగేశారు..

ఆమధ్య నుపుర్ శర్మ వివాదంలో బీజేపీ చేతులు కడిగేసుకుంది. ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది, ఆ వ్యవహారంతో పార్టీకి సంబంధం లేదని చెప్పింది. ఇప్పుడు అహూజా వ్యవహారంలో కూడా పార్టీ కవర్ చేసుకోవాలని చూస్తోంది. అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలంటోంది. ఇంత జరిగినా అహూజా తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. గోవధకు పాల్పడితే దాడులు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఆయన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని అంటున్నారు. దేశవ్యాప్తంగా మతోన్మాద రాజకీయాలు పెచ్చుమీరుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఇప్పుడు అహూజా వీడియో బీజేపీకి తలనొప్పిగా మారింది. గతంలో జరిగిన హత్యలకు బీజేపీయే ప్రత్యక్ష కారణం అని రుజువైంది.

First Published:  21 Aug 2022 2:10 AM GMT
Next Story