Telugu Global
National

షిండే వర్గం కుమ్ములాట.. మహా సర్కారు కుప్పకూలేనా..?

అప్పట్లో తనతోపాటు మరో 50మంది ఎమ్మెల్యేలు కూడా గౌహతి క్యాంప్ కి వచ్చారని, అందరూ డబ్బులు తీసుకుని షిండేకి ఓటు వేసినట్టేనా అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే బచ్చు కడు. దీనిపై సీఎం షిండే జోక్యం చేసుకోవాలన్నారు.

షిండే వర్గం కుమ్ములాట.. మహా సర్కారు కుప్పకూలేనా..?
X

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేకి ఇది షాకింగ్ న్యూస్. షిండే వర్గంలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. లంచం తీసుకుని షిండేవైపు వచ్చావంటూ రవి రాణా అనే ఎమ్మెల్యే బచ్చు కడు అనే మరో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై బచ్చు కడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరోపణలు తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ పై ఉందన్నారు. వారిద్దరూ క్లారిటీ ఇవ్వకపోతే సంచలన నిర్ణయం తీసుకుంటానన్నారు. తనతోపాటు మరో 8మంది ఎమ్మెల్యేలు కూడా ఆ సంచలన నిర్ణయానికి కట్టుబడి ఉంటారని హెచ్చరించారు.

ఎవరీ రవి రాణా..?

సినీ నటి, ప్రస్తుత అమరావతి ఎంపీ.. నవనీత్ కౌర్ భర్త రవి రాణా. బందేరా నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే. ఈయన మొదటి నుంచీ వివాదాస్పద నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానంటూ హెచ్చరికలు జారీ చేసి అరెస్ట్ అయ్యారు రాణా. ఆ తర్వాత ఇప్పుడు షిండే వర్గంలో చేరి ఆయన్ను ఇరుకున పెట్టే పని చేశారు. ఇక లంచం తీసుకున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే బచ్చు కడు. ఆయన ప్రహార్ జనశక్తి పార్టీ అధినేత. ఆ పార్టీకి ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే ఉన్నారు. షిండే వర్గంలో ఉన్న చిన్నా చితకా పార్టీలన్నిటితో బచ్చు కడుకి సంబంధాలున్నాయి. ఈ సంబంధాలను అడ్డు పెట్టుకునే ఆయన ఇప్పుడు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు షిండే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎందుకీ గొడవ..?

అమరావతి ఏరియాపై పెత్తనం కోసం రవిరాణా ఇలా బచ్చు కడుపై ఆరోపణలు చేశారని అంటున్నారు. అమరావతి పక్కపక్కనే ఉన్న రెండు నియోజకవర్గాలకు వారిద్దరూ ఎమ్మెల్యేలు. రవి రాణా భార్య నవనీత్ అమరావతి ఎంపీగా ఉండటంతో.. ఆ ప్రాంతంపై పెత్తనం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. బచ్చు కడు పక్కలో బల్లెంలా మారారు. దీంతో ఆయనపై ఆరోపణలు చేశారు రవి రాణా. అయితే అవి సీఎం షిండే మెడకు చుట్టుకున్నాయి.

అందరూ లంచాలు తిన్నట్టేనా..?

అప్పట్లో తనతోపాటు మరో 50మంది ఎమ్మెల్యేలు కూడా గౌహతి క్యాంప్ కి వచ్చారని, అందరూ డబ్బులు తీసుకుని షిండేకి ఓటు వేసినట్టేనా అని ప్రశ్నిస్తున్నారు బచ్చు కడు. దీనిపై సీఎం షిండే జోక్యం చేసుకోవాలన్నారు. లేకపోతే అందరూ లంచం కోసమే షిండే వర్గంలో చేరినట్టు భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. మొత్తమ్మీద గౌహతి బ్యాచ్ కి బీజేపీ నుంచి బాగానే సొమ్ము ముట్టిందని జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని ఈ ఆరోపణలతో తేలిపోయింది. ఈ లుకలుకలతో షిండే ఎక్కువ రోజులు సీఎం కుర్చీపై సంతోషంగా ఉండే అవకాశం లేదంటున్నారు.

First Published:  12 Nov 2022 1:58 AM GMT
Next Story