Telugu Global
National

సామాజిక న్యాయానికి పట్టిన జాడ్యం... దివ్యాంగ విద్యార్థులకు ఆగిపోయిన ఫెలోషిప్ లు

దేశంలో పీహెచ్ డీలు చేస్తున్న వేలాది మంది దివ్యాంగ విద్యార్థులకు ఏప్రెల్ నెల నుంచి ఫెలో షిప్ లు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రొసీజర్స్ ను సవరించడంతో ఈ పరిస్థితి దాపురించిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక న్యాయానికి పట్టిన జాడ్యం... దివ్యాంగ విద్యార్థులకు ఆగిపోయిన ఫెలోషిప్ లు
X

ఏ పథకాన్ని అయినా అమలు చేస్తున్నప్పుడు దానికి ఎంతో చిత్తశుద్ధి అవసరం. అది విద్యారంగమైనా ..మరో రంగమైనా సరే.. మరీ ముఖ్యంగా విద్యార్థుల ఉజ్వల భవితవ్యానికి ఊతమిచ్చే పథకాల అమలుకు సిన్సియారిటీ దోహదపడితేనే అది సార్థకమవుతుంది. ఉదాహరణకు దేశంలో పీహెచ్ డీలు చేస్తున్న వేలాది మంది దివ్యాంగ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నెలకు వచ్చే సుమారు 31 వేల రూపాయల జాతీయ ఫెలోషిప్ లు నేటికీ అందలేదంటే ఎక్కడుంది లోపం ? సాధారణంగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతా మంత్రిత్వ శాఖ ఈ ఫెలోషిప్ లను మంజారు చేస్తుంది. కానీ ఏప్రిల్ నుంచే వీరికి ఇవి అందలేదని ఈ స్కాలర్లు, ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మూడు నెలలుగా ఈ స్కాలర్ షిప్ ల కు పడిన 'కొర్రీ' బూజు ఇప్పటికీ అలాగే ఉంది. మరి మంజూరులో ఎక్కడ జాప్యం జరుగుతోందనడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు అధికారులు. నిధుల విడుదలకు సంబంధించిన మార్గదర్శకసూత్రాలను ఆర్ధిక మంత్రిత్వ శాఖ గత మార్చిలో మార్చిందట. కేంద్ర ఆధ్వర్యంలోని పథకాల కింద నిధుల విడుదలలో ప్రొసీజర్ ని సవరిస్తున్నామంటూ ఈ శాఖ మార్చి 9 న ఓ ఆఫీసు మెమోరాండం ని జారీ చేసింది. అంటే దీనికి ఫండ్స్ రిలీజ్ చేయాలంటే ఓ సెంట్రల్ నోడల్ ఏజెన్సీని నియమించాలట. అప్పటివరకూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఫెలోషిప్ లను విడుదల చేసేవారు.

కానీ మరి ఎక్కడ 'గడియ' పడిందో గానీ దివ్యాంగ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల పీహెచ్ డీ స్కాలర్లకు ..ఏప్రిల్ నుంచి జాతీయ ఫెలోషిప్ లు నిలిచిపోయాయి. దీనిపై ఆందోళన చెందిన ఓ స్కాలర్.. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టుకోగా.... ఎలాంటి నిధులనైనా విడుదల చేయాలంటే అందుకు ఓ సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఉండాల్సిందేనని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ నెల 3 న సమాధానమిచ్చింది. ఇది సవరించిన ప్రొసీజర్ అని వివరించింది. కేంద్ర ఆధ్వర్యంలోని పథకాల కింద ఫండ్స్ రిలీజ్ చేయాలంటే ఇలాంటి ఏజెన్సీ ఉండడం తప్పనిసరి అని తెలిపింది. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్టు ఆ అధికారి తెలిపారు.

ప్రతి ఏడాదీ దాదాపు 200 మంది దివ్యాంగ స్కాలర్లకు, 2,300 మంది ఓబీసీ ,ఎస్సీ స్కాలర్లకు ఫెలోషిప్ లు మంజూరవుతుంటాయి.నూతన నోడల్ ఏజెన్సీ సిస్టం కారణంగా కొంత జాప్యం జరుగుతోందన్న విషయాన్నీ ఈ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం అంగీకరించారు. ఈ నెలలో నిధులు విడులవుతాయన్నారు. ఇదే సమయంలో కొత్త సిస్టం కోసం తమ డిపార్ట్మెంట్ ఏర్పాట్లు చేస్తోందని కూడా చెప్పారు. ఈయన ఇలా చెబితే ఈ శాఖ కార్యదర్శి అంజలీ భవ్రా మాత్రం నోరు విప్పలేదు, సెప్టెంబరు 30 వరకు పాత నిబంధనలనే కొనసాగించే వెసులుబాటు ఉందని మరో అధికారి చెప్పారు. ఆ తరువాత సెంట్రల్ నోడల్ ఏజెన్సీనైనా నియమించాలని లేదా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖే నేరుగా స్కాలర్లకు నిధులను విడుదల చేయాలని మరొకరు ఎటూ తేల్చకుండా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఫెలో షిప్ తనకు అందినా.. ఈ ఏడాదికి ఇప్పటివరకు అందకపోవడంతో తాను పీహెచ్ డీ చేయలేకపోతున్నానని, పైగా తన కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉందని రమేష్ కుమార్ అనే స్కాలర్ వాపోయారు. దివ్యాంగ అభ్యర్థుల పట్ల ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతున్నట్టు కనిపిస్తోందన్నారు. మమ్మల్ని వాళ్ళు జాలిగా చూస్తున్నారు తప్పితే వాళ్ళ హామీలను నిలబెట్టుకోవాలన్న చిత్తశుద్ధి వారిలో లేదని విచారం వ్యక్తం చేశాడాయన. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన అనేకమంది స్కాలర్లు దాదాపు ఇలాగే తమ కష్ఠాలను విన్నవించుకున్నారు. మరి వీరికి సామాజిక న్యాయం జరిగేదెప్పుడో ?



First Published:  6 Aug 2022 6:03 AM GMT
Next Story