Telugu Global
National

కేసీఆర్, జగన్‌పై దిగ్విజయ్ వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్, జగన్‌పై దిగ్విజయ్ వ్యాఖ్యలు
X

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు ముందుకు రాకపోయి ఉంటే అప్పట్లో కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏ మార్గంలో సాధించుకునేదని దిగ్విజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని కేసీఆర్‌ చెప్పారని కానీ అ పని చేయలేదని విమర్శించారు.

కేసీఆర్ ఇప్పుడు హఠాత్తుగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా ఆ పని చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ కాంగ్రెస్‌తో జత కట్టవచ్చు కదా అని ఆహ్వానం పలికారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ బతికే ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు బాగానే కష్టపడుతున్నారని కితాబిచ్చారు. రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల తెలంగాణలో మంచి ఫలితాలుంటాయన్నారు.

జగన్‌ మా రాజశేఖర్ రెడ్డి కుమారుడంటూ మాట్లాడారు దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్‌ నాయకుడైన వైఎస్ కుమారుడు కాబట్టే ప్రజలు జగన్‌ను సీఎంగా ఎన్నుకున్నారన్నారు. కేవలం కేసుల విషయంలో తమ పార్టీతో విబేధించి జగన్‌ వెళ్లిపోయారన్నారు.

రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆజాద్ చెప్పడం సిగ్గుమాలిన చర్య అన్నారు.కేవలం స్వార్థపరులు మాత్రమే ఈ సమయంలో కాంగ్రెస్‌ను వీడుతున్నారని విమర్శించారు. 1977 నుంచి ఆజాద్ తాను కలిసి పనిచేశామని మంత్రిగా ఉన్నప్పుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎలాంటి ఫిర్యాదులు చేయని ఆజాద్ ఇప్పుడు రాహుల్‌పై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తి ఆజాద్ అని దిగ్విజయ్‌ విమర్శించారు.

భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత్ బలమని దాన్ని ధ్వంసం చేసే పనిని బీజేపీతో పాటు ఎంఐఎం కూడా చేస్తోందన్నారు. రాహుల్‌ భారత్ జోడో యాత్ర దేశాన్ని ఐక్యం చేసే యాత్రగా అభివర్ణించారు. కన్యాకుమారి టూ కశ్మీర్‌ వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. భారత్‌ను ఏకం చేసే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. రాహుల్ పదవుల కోసం పోరాటం చేయడం లేదని ఒక ఐడియాలజీ కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు. అన్ని మతాలను గౌరవించాలని వివేకానందుడే చెప్పారన్నారు.

వ్యాపారులకు, కార్పొరేట్‌ సంస్థలకు తాము వ్యతిరేకంగా కాదని.. దేశాన్ని రెండు కార్పొరేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి వదిలేయడంపైనే తమ ఆందోళన అన్నారు. ఒక్క చిరు వ్యాపారికైనా, ఒక్క సామాన్యుడికైనా, ఒక్క రైతుకైనా రుణమాఫీ చేయకుండా కార్పొరేట్ శక్తులకు మాత్రం లక్షల కోట్ల రుణమాఫీ చేస్తున్నారని విమర్శించారు.

First Published:  6 Sep 2022 1:35 PM GMT
Next Story